Mushrooms: ఇవి రోజుకు ఐదు తింటే చాలు... ఆరోగ్యం పదిలం!

Researchers says eating 5 mushrooms a day will reduce heart desceases and cancer risk
  • పుట్టగొడుగుల్లో కీలక విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు
  • గుండె జబ్బులు, క్యాన్సర్ ముప్పు తగ్గుతుందన్న నిపుణులు
  • రోజువారీ ఆహారంలో పుట్టగొడుగులు ఉండేలా చూసుకోవాలని సూచన
మనిషి ఏంచేయాలన్నా ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరం. ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, మినరల్స్, విటమిన్లు... ఇలా శరీరానికి అవసరమైనవి అందుతుంటేనే ఆరోగ్యంగా ఉంటాం. కాగా, అమెరికా పరిశోధకులు ఆసక్తికర విషయాన్ని తెరపైకి తెచ్చారు. 

పోషక విలువలు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులను తింటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుందని, క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుందని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుడు రాబర్ట్ బీల్ మన్ అంటున్నారు. బీల్ మన్ పెన్సిల్వేనియా వర్సిటీలో ప్లాంట్ అండ్ మష్రూమ్ ప్రొడక్ట్స్ ఫర్ హెల్త్ విభాగం డైరెక్టర్ గా ఉన్నారు. 

ఇంతకీ బీల్ మన్ ఏం చెబుతున్నారంటే... రోజుకు 5 పుట్టగొడుగులు తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ బారినపడే అవకాశాలు బాగా తగ్గుతాయట. అంతేకాదు, పెద్దల్లో వచ్చే డిమెన్షియా (మతిపరుపు)కు కూడా పుట్టగొడుగులు ఔషధాల్లా పనిచేస్తాయని బీల్ మన్ తెలిపారు. 

మనిషి ఆరోగ్యానికి ఎంతో కీలకమైన  ఎర్గోథియోనీన్, గ్లుటాథియోన్ అనే రెండు యాంటీఆక్సిడెంట్లు పుట్టగొడుగుల్లో సమృద్ధిగా ఉంటాయని, ఇవి తీవ్ర అనారోగ్యం కలిగించే కణజాలాన్ని సమర్థవంతంగా కట్టడి చేస్తాయని బీల్ మన్ వివరించారు. ఈ అంశం పరిశోధనల్లో నిరూపితమైందని తెలిపారు. 

పుట్టగొడుగుల్లో కెలోరీలు తక్కువగా ఉన్నప్పటికీ... బి కాంప్లెక్స్ సహా కీలక విటమిన్లు, గుండె ఆరోగ్యానికి తోడ్పడే సెలీనియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయని వెల్లడించారు. పుట్టగొడుగుల్లోని పదార్థాలు క్యాన్సర్ నివారణలో ముఖ్యపాత్ర పోషిస్తాయని, శరీరంలో కణజాల వాపును తగ్గించి, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయని బీల్ మన్ పేర్కొన్నారు.

దాంతో పాటే, శరీరంలో కణితుల పెరుగుదలను కూడా నిరోధిస్తాయని అన్నారు. పుట్టగొడుగుల్లో అత్యధిక శాతం ఉండే ఫైబర్, తక్కువగా ఉండే కెలోరీల వల్ల కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తాయని తెలిపారు. అందుకే రోజువారీ ఆహారంలో పుట్టగొడుగులు ఉండేలా చూసుకోవాలని సలహా ఇచ్చారు. 
Mushrooms
Cancer
Heart Desease
Penn State University
USA

More Telugu News