RGV: పుష్ఫ 2 టికెట్ రేట్లపై పిట్టకథ చెప్పిన ఆర్జీవీ.. సంచలన ట్వీట్

Ram Gopal Varma Sensational Tweet On Pushpa 2 Movie Ticket Rates
  • రేటు ఎక్కువని అనుకుంటే చూడొద్దని సూచన
  • బ్రాండెడ్ వస్తువుల రేట్లను వదిలేసి సినిమా టికెట్ రేట్లపై ఎందుకు ఏడుస్తున్నారంటూ ప్రశ్న
  • సినిమాలు లాభాల కోసమే నిర్మిస్తారని స్పష్టం చేసిన వర్మ
పుష్ప 2 సినిమా టికెట్ రేట్లపై విమర్శలు చేస్తున్న వారికి రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో గట్టిగా జవాబిచ్చారు. టికెట్ రేట్లు ఎక్కువని అనుకునే వారు సినిమా చూడొద్దని సూచించారు. వారం తర్వాతో లేక నెల తర్వాతో టికెట్ ధరలు తగ్గాకే సినిమా చూడాలని హితవు పలికారు. ఎంటర్టైన్ మెంట్ నిత్యావసరం కాదని, నిత్యావసరాల ధరలు పెరిగినా, లగ్జరీ, బ్రాండెడ్ వస్తువుల ధరలపైనా ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరలపై మాత్రం ఎందుకు ఏడుస్తున్నారని ఆర్జీవీ నిలదీశారు. డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్  డిఫరెన్స్ మీదే పనిచేస్తుందన్నారు. అన్ని వస్తువులలాగే  సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి తప్ప ప్రజాసేవ కోసం కాదని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ఆర్జీవీ ఓ పిట్టకథ చెప్పారు. 

‘‘సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి, ప్లేట్ ఇడ్లీల ధరను రూ.1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు.  “సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదు”అని ఎవరైనా ఏడిస్తే , అది “సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు” అని ఏడ్చినంత  వెర్రితనం. ఒకవేళ “సెవెన్‌స్టార్ హోటల్‌లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం” అని వాదిస్తే, పుష్ప 2 విషయంలో ఆ సెవెన్‌స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమానే’’ అని ట్వీట్ చేశారు. 

నిత్యావసరాలని బ్రాండింగ్ ఉన్న ఇల్లు, తిండి, బట్టల ధరలే ఆకాశాన్ని తాకుతుంటే నిత్యావసరం కాని పుష్ప 2 సినిమాకు ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువేనని ఆర్జీవీ తేల్చిచెప్పారు. రేట్లు ఎక్కువ అని అనుకునే వారు సినిమా చూడడం మానేయొచ్చు లేదా రేట్లు తగ్గాక చూడొచ్చు.. వారికి ఆ ఆప్షన్ ఉందని గుర్తుచేశారు. ఇక, సుబ్బారావు హోటల్ చైన్ విషయానికి వస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయిందని చెప్పారు. సుబ్బారావుకు చెందిన ఏ హోటల్ లోనూ కూర్చునేందుకు చోటు దొరకకపోవడమే దీనికి నిదర్శనమని పరోక్షంగా పుష్ప 2 సినిమాకు బుకింగ్స్ మొత్తం పూర్తయ్యాయని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.
RGV
Pushpa 2
Movie Ticket Price
High Rates
Allu Arjun
Viral Tweet

More Telugu News