Amaravati: అమరావతి పనులకు మళ్లీ టెండర్లు... ఏపీ సర్కారు కీలక నిర్ణయం

AP Govt decided to invite re tenders for Amaravati
  • అమరావతిలో ఆగిన పనులపై ఇంజినీర్లతో కమిటీ వేశామన్న మంత్రి నారాయణ
  • కమిటీ నివేదిక మేరకు పాత టెండర్లు రద్దు చేస్తున్నట్టు వెల్లడి
  • డిసెంబరు చివరి నాటికి కొత్త టెండర్లు పిలుస్తామని వివరణ
  • జనవరి నుంచి పనులు ప్రారంభం!
  • మూడేళ్లలో అమరావతి పూర్తయ్యేలా కార్యాచరణ
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. అమరావతి పనులకు మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అమరావతిలో ఆగిన పనులపై ఇంజినీర్లతో కమిటీ వేశామని చెప్పారు. కమిటీ నివేదిక మేరకు టెండర్లు రద్దు చేసి, మళ్లీ పిలిచేందుకు నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. రూ.11,471 కోట్లతో అమరావతిలో పనులు చేపట్టాలని నిర్ణయించినట్టు మంత్రి నారాయణ పేర్కొన్నారు. 

అమరావతిలో నిర్మించిన ఆస్తులకు గత ప్రభుత్వ హయాంలో రూ.286 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అన్నారు. రహదారుల ధ్వంసం కారణంగా మరో రూ.150 కోట్ల నష్టం జరిగిందని తెలిపారు. ఇప్పుడు మళ్లీ టెండర్లు పిలవడం ద్వారా రూ.452 కోట్ల మేర అదనపు జీఎస్టీ భారం పడుతుందని వివరించారు. 

014-19 మధ్య మిగిలిన పనుల విలువ రూ.7,391 కోట్లు అని మంత్రి నారాయణ వెల్లడించారు. టెండర్ల ద్వారా పనుల విలువ రూ.2,507 కోట్ల మేర పెరిగిందని... గత ప్రభుత్వం పనులు చేసి ఉంటే, ప్రస్తుత ప్రభుత్వంపై ఈ భారం తగ్గేదని అన్నారు. 

ఇక, ట్రంక్ రోడ్ల నిర్మాణానికి రూ.461 కోట్ల మేర ధర పెరిగిందని, అమరావతిలో 320 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు, 1200 కిలోమీటర్ల మేర లేఅవుట్ రోడ్లు పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. అసెంబ్లీ భవనం, హైకోర్టు భవనం, 5 పరిపాలనా భవనాలు, 3,600 అపార్ట్ మెంట్లు పూర్తికావాల్సి ఉందని మంత్రి నారాయణ వివరించారు. 

రాజధానికి సంబంధించి సాంకేతిక, న్యాయపరమైన అంశాలన్నీ పూర్తయ్యాయని, నెలాఖరులో అన్ని టెండర్లు పిలిచి వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. మూడేళ్లలో పనులన్నీ పూర్తి చేసేలా కార్యచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. రాజధాని పనులకు గతంలో రూ.41 వేల కోట్ల మేర అంచనాలు రూపొందించామని, ఇప్పుడు ఆ పనులకు మరో 30 శాతం మేర అదనంగా ఖర్చవుతుందని అన్నారు.
Amaravati
Tenders
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News