Parliament: ఫ్లోర్ లీడర్లతో లోక్ సభ స్పీకర్ సమావేశం.... రేపటి నుంచి యథావిధిగా పార్లమెంటు సమావేశాలు

Loksabha Speaker Om Birla held meeting with floor leaders to resolve deadlock in Parliament
  • పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిష్టంభన
  • ఫ్లోర్ లీడర్లతో చర్చించిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
  • అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారన్న కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
పార్లమెంటు కార్యకలాపాల్లో ప్రతిష్టంభన ఏర్పడడం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో... లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నేడు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం నిర్వహించారు. 

టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, కాంగ్రెస్ నుంచి గౌరవ్ గోగోయ్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, సమాజ్ వాదీ పార్టీ నుంచి ధర్మేంద్ర యాదవ్, జేడీయూ నుంచి దిలేశ్వర్ కమాయిత్, ఆర్జేడీ నుంచి అభయ్ కుష్వాహా, తృణమూల్ నుంచి కల్యాణ్ బెనర్జీ, శివసేన (ఉద్ధవ్ థాకరే) నుంచి అర్వింద్ సామంత్, సీపీఐ (ఎం) నుంచి కె.రాధాకృష్ణన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. 

ఈ సమావేశంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. పార్లమెంటు ప్రతిష్టంభనపై కేంద్రం, విపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయని... రేపటి నుంచి ఉభయ సభలు సజావుగా నడుస్తాయని ఆశిస్తున్నామని చెప్పారు. 

అంతేకాకుండా... పార్లమెంటు ఉభయ సభల్లో రాజ్యాంగంపై చర్చ జరగనుందని వెల్లడించారు. లోక్ సభలో డిసెంబరు 13, 14 తేదీల్లో... రాజ్యసభలో డిసెంబరు 16, 17 తేదీల్లో భారత రాజ్యాంగంపై చర్చ చేపడుతున్నట్టు కిరణ్ రిజిజు వివరించారు. రాజ్యాంగంపై మొదట లోక్ సభలో చర్చించాలన్న నిర్ణయానికి అందరూ ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. 

ఏదైనా అంశాన్ని లేవనెత్తాలనుకుంటే నోటీసు ఇవ్వడం ద్వారా మాట్లాడొచ్చని, అంతే తప్ప సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం మంచిది కాదని స్పీకర్ చెప్పారని వెల్లడించారు. స్పీకర్ ప్రతిపాదనకు అందరూ సమ్మతించారని తెలిపారు.
Parliament
Om Birla
Floor Leaders
Centre

More Telugu News