Hunter Biden: అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే ముందు.. జో బైడెన్ సంచలన నిర్ణయం

American President Joe Biden Issues Official Pardon For Son Hunter
  • క్రిమినల్ కేసుల్లో కుమారుడు హంటర్ బైడెన్‌కు క్షమాభిక్ష ప్రసాదించిన బైడెన్
  • హంటర్‌పై కేసులు రాజకీయ ప్రేరేపితమని ఆరోపణ
  • తానీ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ప్రజలు అర్ధం చేసుకుంటారన్న బైడెన్
అమెరికా అధ్యక్ష పీఠం నుంచి వైదొలగే ముందు జోబైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు హంటర్ బైడెన్‌పై ఉన్న అక్రమ ఆయుధ కొనుగోలు సహా రెండు క్రిమినల్ కేసుల్లో క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ తన కుమారుడిపై ఉన్న కేసులు రాజకీయ ప్రేరేపితమైనవని ఆరోపించారు. న్యాయశాఖ తీసుకునే నిర్ణయాల్లో తాను జోక్యం చేసుకోబోనని, ఇదే విషయాన్ని అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాడే చెప్పానని పేర్కొన్నారు. ఆ మాటకు కట్టుబడి ఉండి తన కుమారుడిని అన్యాయంగా విచారించే సమయంలోనూ మౌనంగానే ఉన్నానని గుర్తు చేసుకున్నారు. రాజకీయ కుట్రలో భాగంగా హంటర్‌పై పెట్టిన కేసుల్లో క్షమాభిక్ష ప్రసాదించాలని నిర్ణయించినట్టు తెలిపారు. తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్టు వివరించారు.

హంటర్‌పై కేసులు ఎందుకంటే?
హంటర్ బైడెన్ 2018లో తుపాకి కొంటూ ఆయుధ డీలర్‌కు ఇచ్చిన ఫారంలో తప్పుడు సమాచారం ఇచ్చారు. అయితే, తన వద్ద అక్రమ ఆయుధం లేదని, తాను అక్రమంగా డ్రగ్స్ కొనుగోలు చేయలేదని తెలిపారు. ఈ రెండు విషయాల్లోనూ ఆయన చెప్పింది అబద్ధమని తేలింది. ఆయన 11 రోజులపాటు అక్రమ ఆయుధం కలిగి ఉండడంతోపాటు కాలిఫోర్నియాలో 1.4 మిలియన్ డాలర్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్టు కేసు నమోదైంది. 

అక్రమ ఆయుధం కేసులో ఈ ఏడాది జూన్‌లో హంటర్‌ను న్యాయస్థానం దోషిగా నిర్ధారించినా శిక్ష ఖరారు చేయలేదు. అప్పట్లో జో బైడెన్ మాట్లాడుతూ తన కుమారుడి తరపున క్షమాభిక్ష కోరబోనని స్పష్టం చేశారు. మరో నెల రోజుల్లో అధ్యక్ష పీఠం నుంచి వైదొలగే వేళ కుమారుడికి ఆ కేసుల నుంచి విముక్తి కల్పిస్తూ క్షమాభిక్ష ప్రసాదించడం చర్చనీయాంశమైంది.
Hunter Biden
Joe Biden
USA

More Telugu News