Champions Trophy 2025: ఇక మీ ఇష్టం.. చాంపియన్స్ ట్రోఫీపై పాకిస్థాన్‌కు తేల్చి చెప్పేసిన ఐసీసీ

Its up to you ICC Told Pakistan About Champions Trophy
  • హైబ్రిడ్ మోడల్‌కు పాక్ అంగీకరించాల్సిందేనన్న ఐసీసీ
  • లేదంటే ట్రోఫీ నిర్వహణ విషయాన్ని మర్చిపోవాలని సూచన
  • భారత జట్టు ఆడకుంటే బ్రాడ్‌కాస్టర్లు ఒక్క రూపాయి కూడా ఇవ్వరన్న ఐసీసీ వర్గాలు
  • హైబ్రిడ్ మోడల్‌కు పాక్ అంగీకరించకుంటే ఆ జట్టు లేకుండానే ట్రోఫీ జరుగుతుందని తేల్చేసిన ఐసీసీ
చాంపియన్స్ ట్రోఫీ విషయంలో కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు, సందిగ్ధతకు ఐసీసీ ఫుల్‌స్టాప్ పెట్టింది. హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరిస్తే సరేనని, లేదంటే ట్రోఫీ నిర్వహణ విషయాన్ని మర్చిపోవాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి తేల్చి చెప్పేసింది. పీసీబీ మొండి వైఖరి కారణంగా నిన్న జరిగిన ఐసీసీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే, భదత్రా పరమైన కారణాలతో పాక్‌ పర్యటనకు భారత్ జట్టును పాక్ పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని బీసీసీఐ, ఐసీసీ పట్టుబడుటున్నాయి. ఇందుకు పాక్ నిరాకరించింది. ట్రోఫీ మొత్తాన్ని తమ గడ్డపైనే నిర్వహించాలని పట్టుబట్టడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. 

ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఐసీసీ సమావేశంలో పీసీబీ మరోమారు అదే మొండివైఖరి ప్రదర్శించింది. దీంతో ఐసీసీ తీవ్రంగా స్పందించింది. హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరిస్తే సరేనని, లేదంటే ట్రోఫీ నిర్వహణ నుంచి పక్కకు తప్పుకోవాలని తేల్చి చెప్పేసింది. ఐసీసీ బోర్డు సభ్యుల్లో చాలామంది పాకిస్థాన్ పట్ల సానుభూతితో వ్యవహరించారు. ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్ ఒక్కటే ఆమోదయోగ్యమైన పరిష్కారమని పీసీబీ చీఫ్ మోసిన్ నక్వీకి సూచిస్తూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

హైబ్రిడ్ మోడల్‌కు పాక్ అంగీకరిస్తే యూఏఈలో భారత్-పాక్ మ్యాచ్‌లు జరుగుతాయి. లేదంటే లేనట్టే. ఐసీసీ ఈవెంట్‌లో భారత్ ఆడకుంటే బ్రాడ్‌కాస్టర్లు రూపాయి కూడా ఇవ్వరని, ఈ విషయం పాకిస్థాన్‌కు కూడా తెలుసని ఐసీసీ బోర్డు వర్గాలు తెలిపాయి. హైబ్రిడ్ మోడల్‌కు నక్వీ అంగీకరిస్తే శనివారం (నేడు) సమావేశం జరుగుతుందని పేర్కొన్నాయి. ఒకవేళ పాక్ ఇందుకు అంగీకరించకుంటే వేరే దేశానికి (బహుశా యూఏఈకి) తరలించే అవకాశం ఉందని, అప్పుడా టోర్నీ పాక్ లేకుండానే జరుగుతుందని ఆ వర్గాలు తేల్చి చెప్పాయి. 
Champions Trophy 2025
Pakistan
India
ICC
BCCI
PCB

More Telugu News