Digital Arrest: డిజిటల్ అరెస్ట్ స్కాం నుంచి వృద్ధుడిని కాపాడిన బ్యాంక్ ఉద్యోగి

SBI staff saved 61 year old from losing Rs 13 lakh to Digital Arrest scam
  • వృద్ధుడి ఖాతాలలో రూ.13 లక్షల మొత్తం  
  • మొత్తం డ్రా చేసేందుకు బ్యాంకుకు వచ్చిన వృద్ధుడు
  • ఆయన ఆందోళనను గుర్తించి ముప్పును తప్పించిన బ్యాంక్ సిబ్బంది
ఓ సీనియర్ సిటిజన్ బ్యాంకుకు వచ్చి తన ఖాతాలోని సొమ్మంతా డ్రా చేయడానికి ప్రయత్నించాడు.. ఆయన సొమ్ము ఆయన తీసుకుంటున్నాడని వదిలేయకుండా బ్యాంకు సిబ్బంది కాస్త అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆ సీనియర్ సిటిజన్ తన డబ్బు కోల్పోయే ముప్పును తప్పించుకున్నాడు. రూ.13 లక్షల సైబర్ మోసాన్ని ఎస్ బీఐ సిబ్బంది అడ్డుకున్నారు. హైదరాబాద్ లో చోటుచేసుకుందీ ఘటన. బ్యాంకు సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని ఎస్ బీఐ బ్యాంకు ఏసీ గార్డ్స్ బ్రాంచ్ కు ఇటీవల ఓ సీనియర్ సిటిజన్ వెళ్లాడు. తన ఖాతాలోని సొమ్ముతో పాటు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన సొమ్మును కూడా విత్ డ్రా చేసుకుంటానని సిబ్బందికి చెప్పాడు.

దీనికోసం పేపర్ వర్క్ మొదలుపెట్టిన బ్యాంకు ఉద్యోగి సూర్య స్వాతికి ఆ వృద్ధుడి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. ముఖంలో ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపిస్తుండడంతో వృద్ధుడు ఏదో సమస్యలో ఇరుక్కున్నాడని అర్థం చేసుకుంది. దీంతో ఇంత డబ్బు ఒకేసారి తీసుకుంటున్నారు, ఈ డబ్బుతో ఏంచేయబోతున్నారని అడగగా వృద్ధుడు పొంతనలేని జవాబులు ఇచ్చాడు. అది చూసి అప్రమత్తమైన సూర్య స్వాతి విషయాన్ని బ్యాంకు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లింది.

ఇద్దరూ కలిసి వృద్ధుడికి కౌన్సెలింగ్ ఇస్తూ విషయం రాబట్టారు. డిజిటల్ అరెస్ట్ అంటూ ఫోన్ వచ్చిందని వృద్ధుడు చెప్పడంతో అదంతా ఫేక్ అని, సైబర్ మోసం అని వృద్ధుడికి వివరించారు. ఇటీవలి కాలంలో జరిగిన మోసాలకు సంబంధించిన వార్తలను కంప్యూటర్ లో చూపించి వృద్ధుడికి ధైర్యం చెప్పారు. ఆపై సైబర్ పోలీసులకు సమాచారం అందించగా.. వారు కూడా వచ్చి వృద్ధుడికి ధైర్యం చెప్పారు. సీనియర్ సిటిజన్ ను సైబర్ మోసం నుంచి తప్పించిన బ్యాంకు సిబ్బందిని పోలీసులు అభినందించారు.
Digital Arrest
scam
Cybercrime
SBI
Hyderabad

More Telugu News