Vladimir Putin: ట్రంప్ సెక్యూరిటీపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు

Putins Chilling Warning For US President Elect Donald Trump
  • ప్రస్తుతం ఆయన సేఫ్ గా లేరన్న రష్యా ప్రెసిడెంట్
  • ట్రంప్ తెలివైన వ్యక్తి అంటూ ప్రశంసలు
  • ముప్పును గుర్తించి జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నట్లు పుతిన్ వెల్లడి
అగ్రరాజ్యం అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఏమాత్రం సేఫ్ గా లేరని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఒకటికి రెండుసార్లు ట్రంప్ పై హత్యాయత్నం జరగడం, మరోసారి ట్రంప్ సభకు ఓ అనుమానితుడు ఆయుధాలతో హాజరుకావడం తదితర సంఘటనలను పుతిన్ ప్రస్తావించారు. అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం అసాధారణమేమీ కాకున్నా వెంటవెంటనే జరగడం మాత్రం అసాధారణమేనని అభిప్రాయపడ్డారు.

తన అంచనా ప్రకారం ప్రస్తుతం ట్రంప్ డేంజర్ లోనే ఉన్నాడని చెప్పారు. అయితే, ట్రంప్ చాలా తెలివైన వ్యక్తి, నాయకుడు అని ప్రశంసలు గుప్పించారు. తనకు పొంచి ఉన్న ముప్పును అర్థం చేసుకుని ట్రంప్ జాగ్రత్తగా ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు కజకిస్థాన్‌లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న పుతిన్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రత్యర్థులు ఆయన పిల్లలను, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని పుతిన్ పేర్కొన్నారు. ట్రంప్ ను ఎదుర్కొనేందుకు ఆయన ప్రత్యర్థులు అనాగరిక పద్ధతులు ఎంచుకున్నారని విమర్శించారు. మరోవైపు, ఉక్రెయిన్ విషయంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తీరు సరికాదని పుతిన్ మండిపడ్డారు. 

అమెరికా ఉక్రెయిన్ కు అందించిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై ప్రయోగించేందుకు బైడెన్ ఇటీవల అనుమతించిన విషయాన్ని పుతిన్ గుర్తుచేశారు. బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయం ట్రంప్ ను మరింత ఇరకాటంలోకి నెడుతుందని, బహుశా అందుకోసమే బైడెన్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని అభిప్రాయపడ్డారు. అయితే, బాధ్యతలు చేపట్టాక దీనిపై ట్రంప్ సరిగ్గా స్పందిస్తాడని తాను భావిస్తున్నానని, ఏదేమైనా చర్చలకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామని పుతిన్ వివరించారు.
Vladimir Putin
Donald Trump
Trump Security
America
Joe Biden
Russia Ukraine war

More Telugu News