KTR: ఇలా జ‌రుగుతుంద‌ని ఎవ‌రూ అనుకోలేదు: కేటీఆర్‌

BRS Working President KTR Criticizes Congress Government
  • పింఛ‌న్ల కోసం వృద్ధుల ధ‌ర్నాపై 'ఎక్స్' వేదిక‌గా స్పందించిన కేటీఆర్‌
  • వృద్దుల పెన్షన్ డబ్బులను ఆపుతారని ఎవరూ అనుకోలేద‌న్న మాజీ మంత్రి
  • టంచన్‌గా అకౌంట్లో పడే పైసలు ఆగిపోతాయని ఎవరూ అనుకోలేదంటూ కేటీఆర్ ఆవేద‌న‌
నారాయ‌ణ‌పేట జిల్లా ధ‌న్వాడ మండ‌ల కేంద్రంలో వృద్ధులు పింఛ‌న్ల కోసం రోడ్డెక్క‌డంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌తి నెల పింఛ‌న్ల పంపిణీలో జాప్యం జ‌రుగుతుంద‌ని వృద్ధులు ధ‌ర్నాకు దిగారు. స‌మ‌యానికి పింఛ‌న్ ఇవ్వాల‌ని వారు డిమాండ్ చేశారు. ఈ ధ‌ర్నాపై కేటీఆర్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు.   

ఇలా అవుతుంద‌ని ఎవరు అనుకోలేదు. తెలంగాణాలో పింఛన్ల కోసం వృద్దులు రోడ్డెక్కుతారని, టంచన్‌గా అకౌంట్లో పడే పైసలు ఆగిపోతాయని ఎవరూ అనుకోలేద‌ని అన్నారు. మూసీ సుంద‌రీక‌ర‌ణ‌ కోసం లక్షా యాభై వేల కోట్లు వెదజల్లి... కనికరం లేకుండా వృద్దుల పెన్షన్ డబ్బులను ఆపుతారని ఎవరనుకున్నారు? అని కేటీఆర్ నిల‌దీశారు. 

మందుబిళ్లల కోసం కొడుకులు , కోడళ్ల‌ దగ్గర చేయిచాచే అవసరమే లేని రోజుల నుంచి మళ్లీ వేడుకునే  'మార్పు' వస్తుందని ఎవరనుకున్నారు? అని తెలిపారు. అణువణువునా కర్కశత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా ఇక్కట్లే ఉంటాయని ఎవరనుకున్నారు? అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మార్పు ఇంత మోసగిస్తుందని ఎవరనుకున్నారు? అంటూ కేటీఆర్ మండిప‌డ్డారు. 
KTR
BRS
Telangana

More Telugu News