ISKCON: బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్... భారత్ తీవ్ర ఆందోళన

India concerns on Bangladesh minorities for arresting ISKCON leader Chinmoy Krishna Das
  • శాంతియుత నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులు సరికాదన్న భారత్
  • హిందువులు, మైనార్టీలకు రక్షణ కల్పించాలని బంగ్లా ప్రభుత్వానికి సూచన
  • న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా పని చేస్తున్న వారి అరెస్ట్ సరికాదన్న భారత్
ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేయడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. బంగ్లాదేశ్‌లో మైనార్టీ హిందువుల భద్రత పట్ల విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి గత నెలలో అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ క్రమంలో బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి ఆయన పలు వ్యాఖ్యలు చేసినట్లు బంగ్లాదేశ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఢాకా విమానాశ్రయంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనకు కోర్టు బెయిల్‌ను నిరాకరించింది. ఆయన అరెస్ట్‌ను నిరసిస్తూ పలు సంఘాలు బంగ్లాదేశ్‌లో ఆందోళనలు చేపట్టాయి.

చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్ట్, బెయిల్ నిరాకరణపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులు సరికాదని భారత్ పేర్కొంది. హిందువులు, మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

బంగ్లాలో ఇప్పటికే హిందువులు, మైనార్టీలపై తీవ్రవాద గ్రూప్‌లు దాడులు చేస్తున్నాయని, ఇలాంటి సమయంలోనే అరెస్ట్ ఘటన ఆందోళనకరమని భారత్ పేర్కొంది. బంగ్లాదేశ్‌లో మైనార్టీ ఇళ్లలో దోపిడీలు, విధ్వంసం, దేవాలయాలను అపవిత్రం చేయడం వంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయని గుర్తు చేసింది. శాంతియుత సమావేశాల ద్వారా న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం పనిచేస్తున్న వారిని అరెస్ట్ చేయడం దురదృష్టకరమని పేర్కొంది.

కేంద్రం జోక్యం కోరిన ఇస్కాన్

చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోవాలని ఇస్కాన్ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఆయన విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇస్కాన్ అనేది శాంతి, ప్రేమగల భక్తి ఉద్యమమని తెలిపారు.
ISKCON
Bangladesh
India

More Telugu News