magnesium deficiency: హైబీపీ నుంచి గుండె సమస్యల దాకా.. మెగ్నీషియం లోపం చాలా డేంజర్!

From high blood pressure to heart problems magnesium deficiency is very dangerous
  • తెలియకుండానే చాలా మందిలో మెగ్నీషియం లోపం సమస్య
  • ఇది తగిన స్థాయిలో అందకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు
  • ముందు జాగ్రత్త పడితే ఇబ్బందిని తప్పించుకోవచ్చంటున్న నిపుణులు
మనకు అత్యవసరమైన పోషకాల్లో మెగ్నీషియం ఒకటి. అది తగిన స్థాయిలో శరీరానికి అందకపోతే అత్యంత ప్రమాదకర పరిణామాలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు ఎప్పుడో తేల్చారు. మెగ్నీషియం లోపాన్ని ‘హైపోమ్యాగ్నెసీమియా’ అంటారు. పెద్దా, చిన్నా, స్త్రీ, పురుషులు తేడా లేకుండా అందరికీ ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మంది వరకు ఎంతో కొంత మెగ్నీషియం లోపంతో బాధపడుతున్నారు. కానీ సమస్యను గుర్తించలేక దాని సమస్యలను అనుభవిస్తున్నారు. మరి మెగ్నీషియం లోపంతో వచ్చే సమస్యలేమిటో తెలుసుకుందామా...

కండరాల క్షీణత, వణుకు 
మన శరీరంలో కండరాలు సరిగా పనిచేయాలంటే మెగ్నీషియం తప్పనిసరిగా అందాల్సిందే. దీనిలోపం వల్ల కండరాలు క్షీణిస్తాయి. తరచూ పట్టేయడం, వణకడం, తిమ్మిర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెగ్నీషియం లోపం వల్ల కండరాలకు క్యాల్షియం ఎక్కువగా సరఫరా అవుతుంది. అది కండరాలు తీవ్రంగా ప్రతిస్పందించేందుకు కారణం అవుతుంది.

ఆస్టియోపోరోసిస్ (ఎముక సంబంధిత సమస్య)
మెగ్నీషియం లోపం శరీరంలో పరోక్షంగా ఆస్టియో పోరోసిస్‌ సమస్యకు దారితీస్తుంది. అంటే ఎముకలు గుల్లబారిపోయి, బలహీనం అవుతాయి. చిన్న ప్రమాదాలకే ఎముకలు విరుగుతాయి. మెగ్నీషియం లోపం వల్ల ఎముకలకు క్యాల్షియం సరిగా అందకపోవడమే దీనికి కారణం.

అధిక రక్తపోటు
మెగ్నీషియం లోపం వల్ల శరీరంలో అధిక రక్తపోటు (హైబీపీ) పరిస్థితి తలెత్తుతుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. దీనివల్ల గుండెపోటు సంభవించే ప్రమాదం కూడా పెరుగుతుందని గుర్తించారు.

డిప్రెషన్, మానసిక ఒత్తిడి 
శరీరంలో తక్కువ మెగ్నీషియం స్థాయులు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఎన్నో పరిశోధనల్లో తేలింది. డిప్రెషన్, మానసిక ఒత్తిడి, ఆందోళనతో బాధపడే చాలా మంది వ్యక్తుల్లో మెగ్నీషియం లోపం ఉన్నట్టు గుర్తించారు. శరీరంలో విడుదలయ్యే కొన్ని రకాల ఎంజైమ్‌ల తయారీలో మెగ్నీషియం కీలకం కావడమే దీనికి కారణం.

ఆస్తమా..
శరీరంలో మెగ్నీషియం లోపం వల్ల.. ఆస్తమా సమస్య అత్యంత తీవ్రం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మెగ్నీషియం సల్ఫేట్ ఉన్న ఇన్‌ హేలర్లు వాడే వారిలో శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతున్నట్టు పరిశోధనల్లో గుర్తించారని వెల్లడిస్తున్నారు. ఆస్తమా తీవ్రంగా ఉన్నవారికి వైద్యులు మెగ్నీషియం సల్ఫేట్ ను ఎక్కిస్తారని గుర్తు చేస్తున్నారు.

తీవ్రమైన నీరసం, మానసిక-శారీరక బలహీనత
మెగ్నీషియం లోపం ఉన్నవారు దీర్ఘకాలిక తీవ్ర నీరసం, శారీరక-మానసిక బలహీనతలకు లోనవుతారని నిపుణులు చెబుతున్నారు. కావాల్సిన విశ్రాంతి తీసుకున్నా కూడా నీరసంగానే ఉంటుందని, ఏ పనీ చేయలేకుండా కండరాల అలసట, నొప్పి వేధిస్తాయని వివరిస్తున్నారు.

గుండె కొట్టుకునే క్రమం తప్పిపోవడం
శరీరంలో మెగ్నీషియం స్థాయులు తక్కువగా ఉంటే గుండు కొట్టుకునే క్రమంలో మార్పులు వస్తాయి. ఒక క్రమం లేకుండా అప్పటికప్పుడే వేగంగా, మెల్లగా కొట్టుకుంటుంది. ఇది రక్తనాళాలను దెబ్బతీస్తుందని, గుండెపోటుకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

మరి మెగ్నీషియం లోపానికి కారణాలేంటి?
పోషకాహారం తీసుకోకపోవడం, కిడ్నీల ద్వారా మెగ్నీషియం ఎక్కువగా బయటికి వెళ్లిపోవడం, ఎక్కువ సేపు ఆకలితో ఉండటం, మద్యపాన వ్యసనం, పలు రకాల తీవ్ర వ్యాధుల కారణంగా మెగ్నీషియం లోపం తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రక్త పరీక్షల ద్వారా మెగ్నీషియం లోపాన్ని గుర్తించవచ్చని వివరిస్తున్నారు.
magnesium deficiency
Health
offbeat
Heart
blood pressure
Viral News

More Telugu News