Perth Test: పెర్త్ టెస్టులో ముగిసిన రెండో రోజు ఆట... మ్యాచ్ దాదాపు మనదే!

Team India in driver seat in Perth Test
  • బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు
  • రెండోరోజు ఆట చివరికి టీమిండియా 172-0
  • ఓవరాల్ ఆధిక్యం 218 పరుగులు
  • తిరుగులేని ఆరంభాన్నిచ్చిన జైస్వాల్, కేఎల్ రాహుల్
పెర్త్ టెస్టులో టీమిండియా విజయానికి బాటలు పరుచుకుంటోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మ్యాచ్ ను శాసించే స్థితిలో నిలిచింది. ఇవాళ ఆటకు రెండో రోజు కాగా... ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. తద్వారా భారత జట్టు ఓవరాల్ ఆధిక్యం 218 పరుగులకు పెరిగింది. 

ఇవాళ్టి ఆటలో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 104 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ బుమ్రా 5, కొత్త బౌలర్ హర్షిత్ రాణా 3, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు. అనంతరం, రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు... ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తిరుగులేని ఆరంభాన్నిచ్చారు. 

ఈ జోడీని విడదీసేందుకు ఆస్ట్రేలియా బౌలర్లు విఫలయత్నాలు చేశారు. రెగ్యులర్ బౌలర్లకు తోడు లబుషేన్, హెడ్ వంటి పార్ట్ టైమ్ బౌలర్లు బౌలింగ్ చేసినా వికెట్ పడలేదు. స్టార్క్, కమిన్స్, హేజిల్ వుడ్ వంటి స్టార్ పేసర్లు టీమిండియా ఓపెనర్ల ముందు తేలిపోయారు.

నేడు ఆట ముగిసే సమయానికి జైస్వాల్ 90, కేఎల్ రాహుల్ 62 పరుగులతో క్రీజులో ఉన్నారు. జైస్వాల్ స్కోరులో 7 ఫోర్లు, 2 సిక్సులు... రాహుల్ స్కోరులో 4 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.
Perth Test
Team India
Australia
Border-Gavaskar Trophy

More Telugu News