Babysitting Jobs: ఆర్థిక ఇబ్బందులు అధిగమించేందుకు.. అమెరికాలో ఆయాలుగా మారుతున్న ఆంధ్ర, తెలంగాణ విద్యార్థులు

Babysitting jobs becoming popular among Indian students in America
  • పార్ట్ టైం ఉద్యోగాలు దొరక్క ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు
  • క్యాంపస్ బయట ఉద్యోగాలు చేయడం నిబంధనల ఉల్లంఘనే అయినా తప్పని పరిస్థితుల్లో ఉద్యోగాలు
  • గంటకు 13 నుంచి 18 డాలర్లు అందుకుంటున్న వైనం
  • ఉద్యోగంతోపాటు భోజనం, వసతి కూడా లభిస్తుండటంతో అటువైపే మొగ్గు
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు పార్ట్ టైం ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారడంతో జీవనం దుర్భరంగా మారింది. దీంతో ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు బేబీ సిట్టర్ (ఆయా)లుగా మారుతున్నారు. క్యాంపస్ జాబ్స్ కాకుండా ఇలా చేయడం నిబంధనలు ఉల్లంఘించడమే అయినా, పూటగడిచేందుకు తప్పని పరిస్థితుల్లో ఈ పనులు చేస్తున్నారు. 

అమెరికాలో బేబీ సిట్టర్‌లుగా మారుతున్న వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే ఎక్కువ కావడం గమనార్హం. అమ్మాయిలే ఎక్కువగా ఆయాలుగా జాబ్స్ ఎంచుకుంటున్నారు. తిండి, ఉండేందుకు ఇంత చోటు కూడా లభించడంతోపాటు రక్షణ కూడా ఉంటుందని దీనిని ఎంచుకుంటున్నారు. అది కూడా భారతీయ కుటుంబాల్లో పనిచేసేందుకే మొగ్గు చూపుతున్నారు. వారు పనిచేస్తున్న ప్రదేశం బట్టి వేతనం అందుకుంటున్నారు.

‘ఓపెన్ డోర్స్ 2024’ నివేదిక ప్రకారం.. టెక్సాస్‌లో దాదాపు 39 వేల మంది, ఇల్లినాయిస్‌లో 20 వేల మంది, ఒహియోలో 13,500 మంది, కనెక్టికట్‌లో 7 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిలో 50 శాతం మంది తెలుగు రాష్ట్రాల వారే కావడం గమనార్హం. 

బేబీ సిట్టర్లుగా మారుతున్న విద్యార్థులు గంటకు 13 నుంచి 18 డాలర్ల మధ్య అందుకుంటున్నట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. తాను ఆరేళ్ల బాలుడిని రోజుకు 8 గంటలపాటు చూసుకుంటున్నందుకు గంటకు 13 డాలర్లు అందుకుంటున్నట్టు హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి పేర్కొన్నాడు. బాబును చూసుకోవడం వల్ల తనకు భోజనం కూడా ఉచితంగా లభిస్తోందని చెప్పుకొచ్చాడు. 

కనెక్టికట్‌లో ఉన్న మరో విద్యార్థి మాట్లాడుతూ.. తాను వారానికి ఆరు రోజులపాటు రెండున్నరేళ్ల పాపను చూసుకుంటున్నట్టు చెప్పాడు. ఆ రోజుల్లో చిన్నారి తల్లిదండ్రులే తనకు భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పాడు. ఆదివారాల్లో మాత్రం స్నేహితుడి గదిలో ఉంటున్నట్టు పేర్కొన్నాడు.  
Babysitting Jobs
USA
Andhra Pradesh
Telangana
Students

More Telugu News