Nara Lokesh: 5 లక్షల ఐటీ ఉద్యోగాలే మా లక్ష్యం.. గత ప్రభుత్వంలో ఐటీ కంపెనీల్లో వాటాలు అడిగారు: నారా లోకేశ్

5 laks IT jobs are our target says Nara Lokesh
  • వైసీపీ హయాంలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాలేదన్న లోకేశ్
  • ఐటీ కంపెనీల్లో వాటాలు అడిగే పరిస్థితి తీసుకొచ్చారని మండిపాటు
  • ఇలా అయితే రాష్ట్రానికి కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్న
ఐదేళ్లలో ఏపీలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 150 కంపెనీల ద్వారా 50 వేల మందికి ఉద్యోగాలను కల్పించామని చెప్పారు. అనేక సదస్సులు ఏర్పాటు చేసి విశాఖపై దృష్టి పెట్టామని... భూములు కేటాయించి పరిశ్రమలకు శంకుస్థాపనలు చేశామని తెలిపారు. ముందుచూపుతో ఆనాడు డేటా సెంటర్ పాలసీని తీసుకొచ్చి అదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా ఆగిపోయిందని దుయ్యబట్టారు. 

వైసీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఒక్క కాంక్లేవ్ కూడా జరగలేదని... రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని లోకేశ్ విమర్శించారు. గతంలో హైదరాబాద్ లో రేస్ జరిగిందని... అలాంటి రేస్ ఏపీలో ఎప్పుడు నిర్వహిస్తారని అడిగిన ప్రశ్నకు... అప్పటి మంత్రి కోడి.. గుడ్డు పెట్టలేదని సమాధానమిచ్చారని ఎద్దేవా చేశారు. ఆరోజు నుంచి ఐటీ మంత్రి ఇలా ఉంటారా? అని ఏపీకి అవమానం జరిగిందని చెప్పారు. 

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాను పలు కంపెనీలను కలిశానని... గత ప్రభుత్వంలో వాటాలు అడిగారని వారు చెప్పారని లోకేశ్ తెలిపారు. ఐటీ కంపెనీల్లో కూడా వాటాలడిగే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇలా అయితే రాష్ట్రానికి కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. తాము ఐటీ కంపెనీలతో సమావేశమయ్యామని... వారి సమస్యలను తెలుసుకున్నామని చెప్పారు. చంద్రబాబు చొరవ కారణంగా ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ఐటీ రంగంలో 20 శాతం మంది తెలుగువాళ్లు కనిపిస్తున్నారని... ఇది మనకు గర్వకారణమని అన్నారు.
Nara Lokesh
Telugudesam
IT

More Telugu News