Gautam Adani: గౌతమ్ అదానీపై రూ.2,236 కోట్ల లంచం ఆరోపణలు.. అమెరికాలో కేసు, అరెస్ట్ వారెంట్ జారీ!

Charges against Gautam Adani and Arrest warrants issued for Gautam and Sagar Adani in USA
  • 2 బిలియన్ డాలర్ల లాభం పొందే కాంట్రాక్టులు దక్కించుకునేందుకు లంచానికి అంగీకరించినట్టు అభియోగాలు 
  • భారత ప్రభుత్వ అధికారులకు సుమారు రూ.2,236 లంచం చెల్లింపునకు సిద్దమయ్యారని అభియోగాలు
  • అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు కథనాలు
సంచలన పరిణామం చోటుచేసుకుంది. భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికాలో నేరాభియోగాలు నమోదయ్యాయి. 20 ఏళ్లలో ఏకంగా 2 బిలియన్ డాలర్ల భారీ లాభం పొందే కాంట్రాక్టులను దక్కించుకునేందుకుగానూ భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,236 కోట్లు) లంచం చెల్లించడానికి అంగీకరించారని, ఈ మేరకు న్యూయార్క్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయని అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు.

లంచం, మోసపూరిత కుట్ర కింద అభియోగాలు దాఖలయ్యాయని తెలిపారు. గౌతమ్ అదానీ, మేనల్లుడు సాగర్ అదానీతో పాటు మరో ఏడుగురు వ్యక్తులను నిందితులుగా చేర్చినట్టు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు అరెస్ట్ వారెంట్స్ జారీ అయ్యాయని అధికారులు చెప్పారు. భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనేది కూడా లంచం ఇచ్చేందుకు సిద్ధమవడానికి ఒక కారణంగా ఉందని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.

గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్‌లపై సెక్యూరిటీ ఫ్రాడ్, సెక్యూరిటీ ఫ్రాడ్ కుట్ర, వైర్ ఫ్రాడ్ కుట్ర అభియోగాలు నమోదయాయి. అంతేకాదు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ సివిల్ కేసులో గౌతమ్, సాగర్ అదానీలపై అభియోగాలు మోపినట్టు తెలిపారు.

అదానీలు, అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన మరో ఎగ్జిక్యూటివ్, మాజీ సీఈవో వినీత్ జైన్ తమ అవినీతిని దాచిపెట్టి రుణదాతలు, ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా 3 బిలియన్ డాలర్లకుపైగా రుణాలు, బాండ్లను సేకరించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. గౌతమ్ అదానీని ‘న్యూమెరో యునో’, ‘బిగ్ మ్యాన్’ అనే కోడ్ పేర్లతో కుట్రదారులు అదానీ పేరుని ప్రైవేట్‌గా ప్రస్తావించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇక  లంచాలకు సంబంధించిన వివరాలను ట్రాక్ చేయడానికి సాగర్ అదానీ తన సెల్‌ఫోన్ ఉపయోగించారని అభియోగాల్లో పేర్కొన్నారు.

కాగా అమెరికాలో నమోదయిన ఈ అభియోగాలపై అదానీ గ్రూప్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ పరిణామంపై వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఇంకా స్పందించలేదు. నిందితుల తరఫు న్యాయవాదులు ఎవరనేది కూడా ఇంకా తెలియరాలేదు. 
Gautam Adani
Adani Group
Case on Adani
Sagar Adani
USA

More Telugu News