YS Jagan: మా కుటుంబంలో విభేదాలున్నాయి... మీకూ కుటుంబం ఉంది కదా?: చంద్రబాబుపై జగన్ ఆగ్రహం

YS Jagan fires at Chandrababu for differences with Sharmila
  • తల్లి, చెల్లి పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం
  • చంద్రబాబు ఎప్పుడైనా తల్లిదండ్రులను ప్రజలకు చూపించాడా? అని ప్రశ్న
  • తల్లిదండ్రులకు కనీసం రెండు పూటలూ భోజనం పెట్టాడా? అన్న జగన్
మా కుటుంబంలో విభేదాలు ఉన్నాయి... మీకూ కుటుంబం ఉంది కదా... తల్లి, చెల్లి పేరుతో రాజకీయం ఎందుకు చేస్తున్నారు? అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తన సోదరి షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా? అని ప్రశ్నించారు. ఐటీడీపీ పేరుతో తన కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

తనపై, తన తల్లిపై, తన చెల్లిపై అసభ్య పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబూ... నీ తల్లిదండ్రులెవరో ప్రజలకు చూపించావా?

చంద్రబాబు ఎప్పుడైనా తన తల్లిదండ్రులను ప్రజలకు చూపించాడా? అని జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. రాజకీయంగా ఎదిగిన తర్వాత ఆయన తన తల్లిదండ్రులతో కలిసి ఉన్నారా? కనీసం వారికి రెండు పూటలా భోజనం పెట్టి వారిని సంతోషంగా ఇంటికి పంపించారా? వారు చనిపోతే కనీసం తలకొరివి పెట్టాడా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఏమైనా చేస్తాడని, ఏ గడ్డి అయినా తింటాడని, ఏ అబద్ధమైనా ఆడుతాడని, ఏ మోసమైనా చేస్తాడని ధ్వజమెత్తారు.

చంద్రబాబు మరో పదేళ్లు సీఎంగా ఉంటారన్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా... ఎవరు సీఎంగా ఉంటారనే విషయం వారు చేసే మంచి పనుల మీద ఆధారపడి ఉంటుందన్నారు. పనులు చేసినవారిని ప్రజలు ఆశీర్వదిస్తారని అభిప్రాయపడ్డారు.
YS Jagan
YS Sharmila
Chandrababu
YS Vijayamma
Andhra Pradesh

More Telugu News