Alleti Maheshwar Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Alleti Maheshwar Reddy says Revanth Reddy will not win again
  • రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి లేదన్న బీజేపీ నేత
  • ప్రజా విజయోత్సవాలు కాదు... వంచనోత్సవాలు అని విమర్శ
  • రేవంత్ రెడ్డి అసమర్థ ముఖ్యమంత్రి అని తీవ్ర వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఈసారి గెలిచే పరిస్థితి లేదని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి సొంత నియోజకవర్గంలో పోటీ చేయాలని సవాల్ చేశారు. ఆయన మళ్లీ పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లోకి వెళ్లి తెలుసుకోవాలని సూచించారు.

ఈరోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. హామీలపై ఎక్కడ సభ పెట్టినా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. లగచర్లలో భూసేకరణ పేరుతో గిరిజనులను వేధిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్నవి ప్రజా విజయోత్సవాలు కాదని... వంచనోత్సవాలు అని ఎద్దేవా చేశారు. హామీలు నెరవేర్చని రేవంత్ రెడ్డి ఏ మొహంతో విజయోత్సవాలు నిర్వహిస్తున్నారో చెప్పాలన్నారు. ఒక అసమర్థుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏవిధంగా దెబ్బతింటుందో ఇందుకు రేవంత్ రెడ్డి ఉదాహరణ అన్నారు.

ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు కాబట్టి... ప్రతిపక్షాలపై ముఖ్యంగా బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్లను ప్రస్తావించే నైతిక అర్హత కూడా ముఖ్యమంత్రికి లేదన్నారు. కిషన్ రెడ్డి... మోదీ బానిస అని తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి అదే సభలో సోనియా కాళ్లు కడిగి నెత్తిమీద పోసుకుంటానని వ్యాఖ్యానించడం గమనార్హమన్నారు. గతంలో సోనియా గాంధీని బలిదేవత అన్న వ్యక్తి కూడా ఈ రేవంత్ రెడ్డే అని గుర్తు చేశారు. తన పదవిని కాపాడుకోవడానికి రేవంత్ ఏ స్థాయికి దిగజారారో తెలిసిపోతోందన్నారు.

'ఖబడ్దార్ రేవంత్ రెడ్డి... మోదీని, మా నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదు' అని హెచ్చరించారు. ప్రధాని మోదీ ఏ రోజు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. బీజేపీ మద్దతు లేకుంటే తెలంగాణ ఏర్పడి ఉండేదా? ఒకసారి ఆలోచించాలన్నారు. రేవంత్ రెడ్డి పచ్చి అవకాశవాద రాజకీయ నేత అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవకాశవాద రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఏదో అదృష్టం కొద్ది సీఎం అయ్యారని... కాబట్టి బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు.

ఆరు గ్యారెంటీలలో ఒక్క హామీనైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతున్నప్పటికీ ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించని రేవంత్ రెడ్డి అసమర్థ సీఎం కాదా? అన్నారు. మోసపూరిత హామీలతో ప్రజలను మోసగించామని చెప్పి ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నారా? అని ప్రశ్నించారు. పోలీసుల భద్రత మధ్య విజయోత్సవాలు జరుపుకుంటే విజయం అవుతుందా? అన్నారు. 
Alleti Maheshwar Reddy
Congress
BJP
Narendra Modi

More Telugu News