Viral News: విమానంలో పైలట్ భార్య ప్రయాణం.. హృదయాన్ని హత్తుకునే ప్రకటన చేసిన పైలట్

IndiGo pilot recently surprised his wife during a flight with a thoughtful announcement
  • కష్ట సుఖాల్లో అండగా ఉంటున్నావంటూ విమానంలో భార్యకు ధన్యవాదాలు చెప్పిన పైలట్
  • నా భార్య తొలిసారి తనతో విమాన ప్రయాణం చేస్తోందంటూ ప్రకటన
  • ఆశ్చర్యపోయిన భార్య, ఇతర ప్రయాణికులు
  • ఇండిగో విమానంలో ఆసక్తికర ఘటన
ఇండిగో విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ప్రయాణికులు అందరూ సీట్లలో కూర్చొని ఉన్నారు. ఇంతలోనే పైలట్ ప్రకటన మొదలైంది. ‘‘మీ ప్రయాణ భాగస్వామిగా ఇండిగోను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా మీ ప్రయాణంలో భాగమయ్యేందుకు ఎదురుచూస్తుంటాం’’ అని ప్రకటించిన పైలట్.. కొనసాగింపుగా ప్రత్యేక సందేశాన్ని జోడించాడు. 

‘‘ఈ రోజు విమానంలో ఉన్న ఒక స్పెషల్ ప్యాసింజర్ కోసం ప్రత్యేక ప్రకటన చేయాలనుకుంటున్నాను. నా భార్య విభా శర్మ నాతో కలిసి తొలిసారి విమాన ప్రయాణం చేస్తోంది. ఈ ప్రయాణాన్ని నువ్వు ఆస్వాదిస్తున్నావని నేను అనుకుంటున్నాను. కష్ట సుఖాల్లో నా పక్కన ఒక బలమైన పిల్లర్ మాదిరిగా నిలబడుతున్న నీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని పైలట్ ప్రకటించాడు. పైలట్ చేసిన ఈ ప్రకటనతో భార్యతో పాటు ప్రయాణికులు కూడా ఆశ్చర్యపోయారు.

ఇందుకు సంబంధించిన వీడియోను భార్య విభా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘‘విమానంలో మా ఆయన ప్రకటనతో నన్ను ఆశ్చర్యపరిచారు. నేను మళ్లీ ప్రేమలో పడ్డానని అనిపిస్తోంది’’ అని ఆమె పేర్కొన్నారు. విమానం బయలుదేరడానికి ముందు దంపతులు తీసుకున్న ఫొటోలను ఆమె షేర్ చేశారు. అయితే కొద్దిసేపటి తర్వాత వీడియోను ఆమె తొలగించారు.

ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు ఆసక్తికరంగా స్పందించారు. భార్య పట్ల అతడికి ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో అర్థమవుతోందని కొందరు కామెంట్లు పెట్టారు. ఈ పైలట్ లాంటి వ్యక్తి దొరకడం ఆమె అదృష్టమని కొందరు వ్యాఖ్యానించారు. ‘‘వావ్ బ్రో.. నిజంగా చాలా బాగుంది. జీవితాంతం మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ఓ వ్యక్తి కామెంట్ పెట్టాడు. అందమైన జంట అంటూ కొందరు స్పందించారు.
Viral News
Trending News
IndiGo

More Telugu News