Sharmila: మహిళల మానప్రాణాల మీద రాజకీయాలు చేస్తారా?: వైసీపీ, టీడీపీపై షర్మిల ఫైర్

YS Sharmila take a jibe at YCP and TDP over women protection
  • ఏపీ శాసనమండలిలో మహిళల భద్రతపై చర్చ
  • వైసీపీ, టీడీపీ రెండూ రెండేనని షర్మిల విమర్శలు
  • నిర్భయ, దిశ చట్టాలపై ఆర్భాటం తప్పితే అమలు చేయలేదని ఆగ్రహం
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ఆమె సోషల్ మీడియాలో వైసీపీ, టీడీపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళల మానప్రాణాల మీద రాజకీయాలు చేస్తారా? అంటూ మండిపడ్డారు. మహిళలపై అత్యాచారాలను, అఘాయిత్యాలను నివారించడంలో గత పదేళ్లుగా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఇవాళ రాష్ట్ర శాసనమండలిలో జరిగిన చర్చే అందుకు నిదర్శనమని తెలిపారు. 

"2014-19 మధ్య రాష్ట్రంలో 83,202 కేసులు నమోదయ్యాయట. 2019-24 మధ్య నమోదైనవి 1,00,508 కేసులట. తమ పాలనలో కంటే వైసీపీ హయాంలోనే 20 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయని టీడీపీ ఆరోపిస్తే... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకు సగటున 59 అత్యాచార ఘటనలు నమోదవుతున్నాయని వైసీపీ అంటోంది. 

గత పదేళ్లలో దాదాపు రెండు లక్షల కేసులు నమోదయ్యాయంటే, మహిళలకు భద్రత కల్పించడంలో మన రాష్ట్రం ఎక్కడుందో అర్థమవుతోంది. రాష్ట్రంలో నేరాలను అరికట్టలేని వైసీపీ, టీడీపీ సిగ్గుతో తలదించుకోవాలి. నిర్భయ, దిశ వంటి చట్టాలు పేరుకు మాత్రమే. 

మహిళలపై వికృత చేష్టలకు పాల్పడితే నిర్భయ చట్టం కింద 40 రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు... దిశ చట్ట కింద 20 రోజుల్లోనే చర్యలు తీసుకుంటామని జగన్ మహిళల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టారే తప్ప... చట్టాలను మాత్రం అమలు చేయలేదు. పదేళ్లలో ఒక్క నేరస్తుడికైనా కఠిన శిక్ష పడిందా? 

కేసులు ఛేదించాల్సిన పోలీసులను కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటున్నారు. అభివృద్ధిలో చివరిస్థానం... డ్రగ్స్ వాడకంలో, మహిళలపై అఘాయిత్యాలలో ప్రథమస్థానం... ఇదీ మన రాష్ట్ర దుస్థితి" అంటూ షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు.
Sharmila
Women Protection
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News