Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు పోలీసుల రాచమర్యాదలు.. వెలుగులోకి మరో వీడియో

VIP Treatment To Rowdy Sheeter Borugadda Anil Another Video Viral
  • భయ్యా టీ.. అని ఆర్డర్ వేయగానే తెచ్చి ఇచ్చిన పోలీసులు
  • మరో కానిస్టేబుల్ వచ్చి బోరుగడ్డతో ముచ్చట్లు
  • వైరల్ అవుతున్న వీడియోపై ప్రజల ఆగ్రహం
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు పోలీస్ స్టేషన్‌లో రాచమర్యాదలకు సంబంధించి వరుస వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల పోలీస్ స్టేషన్ బల్లపై అనిల్ హాయిగా నిద్రిస్తున్న వీడియో వైరల్ కావడంతో అతడికి దిండు, దుప్పటి ఇచ్చి మర్యాదలు చేసిన పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత అర్ధరాత్రి వేళ ఓ బాలుడు పోలీస్ స్టేషన్‌లో ఉన్న బోరుగడ్డను కలిసేందుకు వచ్చి ఆయన పక్కనే కూర్చుని ముచ్చటించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.

తాజాగా, మరో వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో బోరుగడ్డ ‘భయ్యా ఒక టీ’ అని ఆర్డర్ వేయడం.. ఆ వెంటనే కానిస్టేబుల్ ఒకరు టీ తెచ్చి ఇవ్వడం, ఇంకో కానిస్టేబుల్ ఆయనతో కాసేపు ముచ్చటించడం ఆ వీడియోలో రికార్డయింది.

అదే సమయంలో మరో నిందితుడు పోలీస్ స్టేషన్‌లో కింద కూర్చుకోవడం ఆ వీడియోలో కనిపించింది. వీడియో వైరల్ కావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ సాధారణ ఖైదీని కింద కూర్చోబెట్టిన పోలీసులు, రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డను మాత్రం కుర్చీలో కూర్చోబెట్టి, అతడు అడిగిన వెంటనే టీ తీసుకొచ్చి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరిగి ఉంటుందని, కానిస్టేబుళ్లపై మాత్రమే చర్యలు తీసుకుని వదిలేయకుండా అధికారులపైనా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Borugadda Anil
YSRCP
Police Station

More Telugu News