Senior Citizens: సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలోనే ఆకర్షణీయమైన కొత్త పథకం!

Central government will soon come up with a new policy for senior citizens
  • 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు అండగా కేంద్రం మరో కొత్త విధానం 
  • ఆదాయంతో సంబంధం లేకుండా ఆరోగ్య కవరేజీ అందించేలా స్కీమ్ రూపకల్పన
  • ఇప్పటికే పూర్తయిన సంపద్రింపులు
  • వెల్లడించిన కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్
వయసు పైబడి అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే సీనియర్ సిటిజన్లకు అండగా మరో ఆకర్షణీయమైన పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆరోగ్య కవరేజీని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం త్వరలోనే నూతన విధానాన్ని తీసుకురానుందని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్‌ యాదవ్‌ తెలిపారు. ఈ విధానంపై ఇప్పటికే సంబంధిత భాగస్వాములతో సంప్రదింపులు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. అసోసియేషన్ ఆఫ్ సీనియర్ లివింగ్ ఇండియా (ఏఎస్‌ఎల్‌ఐ) నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్ యాదవ్ ఈ విషయాన్ని చెప్పారు. ఇప్పటికే ఆచరణలో ఉన్న ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన’ మాదిరిగా కాకుండా కొత్త విధానంలో ఆదాయ పరిమితితో సంబంధం ఉండబోదని, ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించిందని అమిత్ యాదవ్ వివరించారు.

కాగా భారతదేశంలో 2050 నాటికి సీనియర్ సిటిజన్ల జనాభా 30 కోట్లు దాటవచ్చని ఏఎస్ఎల్ఏ చైర్మన్, అంటారా సీనియర్ కేర్ ఎండీ, సీఈవో రజిత్ మెహతా అంచనా వేశారు. మొత్తం జనాభాలో 20 శాతంగా ఉంటారని అన్నారు. ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ సీనియర్ లివింగ్ ఇండియా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అందుకే సీనియర్ సిటిజన్ల భద్రతకు సమగ్ర పరిష్కారాలు చూపించాలనే డిమాండ్లు ఉన్నాయని ప్రస్తావించారు. ప్రస్తుతం దేశంలోని వృద్ధుల్లో కేవలం 5 శాతం మందికి మాత్రమే సంస్థాగత వైద్య సంరక్షణ సదుపాయం అందుబాటులో ఉందని, సగం మందికి పైగా వృద్ధులు సామాజిక భద్రత లేకుండానే జీవిస్తున్నారని రజిత్ మెహతా పేర్కొన్నారు.

ఇక వృద్ధుల ఆరోగ్య సంరక్షణ సేవలలో వసతుల్లో కూడా గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయని అన్నారు. ప్రతి 1,000 మంది వృద్ధులకు 0.7 శాతం కంటే తక్కువ హాస్పిటల్ బెడ్‌లు ఉన్నాయని రజిత్ మెహతా పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండే స్థిరమైన సీనియర్ సిటిజన్ల భద్రతా విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. వృద్దుల క్షేమం, హెల్త్‌కేర్‌పై దృష్టి పెట్టాలని రజిత్ మెహతా సూచించారు. భద్రత, సౌకర్యాలు, సామూహిక మద్దతుకు ప్రాధాన్యత ఇచ్చే హౌసింగ్ సొల్యూషన్స్‌ చూపించాలని రజిత మెహతా పేర్కొన్నారు.
Senior Citizens
Central government
ASLI
AB PM-JAY

More Telugu News