Nara Lokesh: నారాయణ సంస్థలతో పోటీపడేలా ప్రభుత్వ కాలేజీలు తీర్చిదిద్దే ప్రయత్నం: మంత్రి లోకేశ్

Minister Lokesh says Govt colleges should compete with Narayana
  • ప్రైవేటుసంస్థలకు దీటుగా ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు చేపడుతున్నామని వెల్లడి
  • కూటమి ప్రభుత్వం వచ్చాక జూనియర్ కాలేజిల్లో విద్యార్థులు పెరిగారన్న మంత్రి
  • ఇండస్ట్రీ అవసరాల మేరకు డిగ్రీ విద్యార్థుల తయారీ దిశగా అడుగేస్తున్నట్లు వెల్లడి
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటర్మీడియట్ విద్యలో పలు సంస్కరణలను తీసుకువస్తున్నామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. నారాయణ సంస్థలతో పోటీపడేలా ప్రభుత్వ కాలేజీలు తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. శాసనసభలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నకు లోకేశ్ సమాధానమిస్తూ... గత ప్రభుత్వంలో విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదని, తాను మంత్రి అయ్యాక ఈ పుస్తకాలు ఇచ్చినట్లు తెలిపారు.

కాలేజీలకు సరైన స్టాఫ్ ఇవ్వకుండా తెరవడం వల్ల విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 15 వేల అడ్మిషన్లు పెరగడం శుభపరిణామం అన్నారు. విద్యార్థులను ఎ, బి, సి కేటగిరిలుగా విభజించి వెనుకబడి విద్యార్థుల కోసం బ్రిడ్జి కోర్సులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నారాయణ సంస్థలతో పోటీపడేలా ప్రభుత్వ కళాశాలలను తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నామన్నారు. ఇందుకోసం మంత్రి నారాయణను ఇన్‌పుట్స్ అడిగామని... నిన్న ఒక వర్క్ షాపునకు ఆయన ముఖ్యఅతిధిగా వచ్చి సలహాలు, సూచనలు ఇచ్చారన్నారు.

స్కూలు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులతో సమావేశమై భవనాలు, ఫ్యాకల్టీ, మెటీరియల్‌పై మాట్లాడినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లకు ర్యాంకింగ్ మెకానిజం తెచ్చి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఫలితాలపై ఎప్పటికప్పుడు సమీక్షించి, తల్లిదండ్రులకు తెలియజేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా మెగా పిటిఎం నిర్వహిస్తున్నామని, దీనికి ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతి ఎమ్మెల్యే... ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ఫీడ్ బ్యాక్ రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. ఏం చేస్తే బాగుంటుందో మీరిచ్చే సలహాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. తగరపువలస డిగ్రీ కాలేజి కేజీబీవీ స్కూలులో రన్ అవుతోందని, త్వరలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సింహాచలం స్కూల్ భవనాల నిర్మాణాన్ని ఆరునెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 169 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయన్నాని తెలిపారు.

కానీ 49 నియోజకవర్గాల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు లేవని... 91 నియోజకవర్గాల్లో ఒకటి, 27 చోట్ల రెండు, 8 చోట్ల 3 డిగ్రీ కాలేజిలు ఉన్నట్లు తెలిపారు. భీమిలి నియోజకవర్గంలో రెండు డిగ్రీ కాలేజీలు ఉన్నాయని, అయితే భీమిలిలో అడ్మిషన్ రేటు 73 శాతం ఉండగా, తగరపువలసలో 36 శాతం మాత్రమే ఉందన్నారు. ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు 50 శాతం దాటడం లేదన్నారు. ఐటీఐకి మాత్రం డిమాండ్ ఉందని, ఫ్యాకల్టీ, భవనాలు, మీడియం కరెక్టుగా లేకపోవడమే అడ్మిషన్ల తగ్గుదలకు కారణమన్నారు. డిగ్రీ కాలేజీలను ఇండస్ట్రీ సెంట్రిక్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
Nara Lokesh
P Narayana
Andhra Pradesh
AP Assembly Session

More Telugu News