Team India: దక్షిణాఫ్రికాపై మూడో టీ20లో విజయంతో ఒక రికార్డు సాధించిన భారత్

India become second team to register 100 T20I wins away from home
  • విదేశాల్లో 100 టీ20 విజయాలు అందుకున్న రెండవ జట్టుగా నిలిచిన టీమిండియా
  • విదేశీ గడ్డపై 152 మ్యాచ్‌లు ఆడగా 43 ఓటములు చవిచూసిన భారత్
  • 116 విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్న పాకిస్థాన్
సెంచూరియన్ వేదికగా భారత్ - దక్షిణాఫ్రికా మధ్య బుధవారం జరిగిన మూడో టీ20లో విజయం సాధించిన టీమిండియా మరో రికార్డును సొంతం చేసుకుంది. విదేశాల్లో 100వ టీ20 గెలుపుని అందుకుంది. విదేశీ గడ్డపై 100 టీ20 విజయాలు సాధించిన రెండవ జట్టుగా భారత్ అవతరించింది. టీమిండియా విదేశాల్లో మొత్తం 152 టీ20 మ్యాచ్‌లు ఆడి 100 విజయాలు సాధించింది. 43 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. 

కాగా ఈ జాబితాలో దాయాది దేశం పాకిస్థాన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. పాకిస్థాన్ విదేశీ గడ్డపై 116 విజయాలు సాధించి టాప్ ప్లేస్‌లో ఉంది. 84 విజయాలతో ఆఫ్ఘనిస్థాన్ మూడవ స్థానంలో ఉంది. ఆ జట్టు విదేశాల్లో 138 టీ20లు ఆడి 84 విజయాలు అందుకుంది. ఆఫ్ఘనిస్థాన్ సొంతగడ్డపై తక్కువ మ్యాచ్‌లు ఆడుతుంటుంది కాబట్టి మూడవ స్థానంలో నిలవగలిగింది.

ఇక అగ్రశ్రేణి జట్లలో ఒకటైన ఆస్ట్రేలియా విదేశాల్లో 137 టీ20 మ్యాచ్‌లు ఆడి 71 విజయాలు సాధించింది. ఇంగ్లండ్ విదేశాల్లో 129 మ్యాచ్‌లు ఆడి 67 గెలుపులు సాధించి ఐదవ స్థానంలో ఉంది.

కాగా సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మూడో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. తిలక్ వర్మ సెంచరీ సాయంతో టీమిండియా నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆతిథ్య సఫారీ జట్టు ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులకే పరిమితమైంది. దీంతో 11 పరుగుల తేడాతో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. నవంబర్ 15న జొహన్నెస్‌బర్గ్‌ వేదికగా నాలుగవ టీ20 మ్యాచ్ జరగనుంది.
Team India
india Vs South Africa
Cricket
Sports News

More Telugu News