KTR: ఎవనిదిరా కుట్ర... నన్ను ఏదో కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు: కేటీఆర్ సంచలన ట్వీట్

KTR tweet about conspiracy and challenges revanth reddy to arrest
  • ఓటేసిన పాపానికి రైతుల భూములు కాజేయాలనుకోవడం కుట్ర అన్న కేటీఆర్
  • ఎదురు తిరిగిన పాపానికి రైతులను నడవలేకుండా చిత్రహింసలు ఎవరు పెట్టారని నిలదీత
  • రైతుల గొంతుక అయి అరెస్టైతే గర్వపడతానన్న కేటీఆర్
  • అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి... నిజం దమ్ము చూద్దువంటూ సవాల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా నిప్పులు చెరిగారు. లగచర్ల ఘటనలో కుట్ర జరిగిందని చెబుతుండటంపై ఆయన ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. 'ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

'నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో, అన్న కోసమో... రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? నీ ప్రైవేట్‌‌ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర? పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర? మర్లపడ (తిరగబడ్డ) రైతులు... ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది?' అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.

నన్ను ఏదో కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసునని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. రైతుల గొంతు అయినందుకే తనను అరెస్ట్ చేస్తే అందుకు గర్వపడతానన్నారు. నీ కుట్రలకు భయపడేవాళ్లు ఇక్కడ ఎవరూ లేరని హెచ్చరించారు. 'అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి... చూద్దువుగానీ నిజానికి ఉన్న దమ్మేంటో' అని రాసుకొచ్చారు.
KTR
Revanth Reddy
BRS
District Collector

More Telugu News