మీకూ మాకూ పెద్ద తేడా లేదు.. జగన్‌పై వైఎస్ షర్మిల మరోసారి విమర్శల దాడి
- బడ్జెట్‌పై తాము చెప్పిందే జగన్ చెప్పారని విమర్శించిన ఏపీసీసీ అధ్యక్షురాలు
- వైఎస్ జగన్ తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుందంటూ వ్యంగ్యాస్త్రాలు
- వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడంపై మండిపాటు
- రాష్ట్రంలో అసలైన ‘ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ’ అని వైసీపీపై విమర్శలు
38 శాతం ఓట్ షేర్ పెట్టుకొని అసెంబ్లీకి పోకుండా వైసీపీని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ’గా మార్చారని షర్మిల మండిపడ్డారు. ‘‘అసెంబ్లీలో అడుగు పెట్టలేని, ప్రజా సమస్యల కోసం సభల్లో పట్టుబట్టలేని, పాలకపక్షాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని అసమర్థ వైసీపీ ఇవాళ రాష్ట్రంలో అసలైన ‘ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ’. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు.. సొంత మైకుల ముందు మాట్లాడడానికి కాదు. అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని. మీకు చిత్తశుద్ధి ఉంటే నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయండి’’ అని షర్మిల అన్నారు.
ప్రతిపక్షం కాకపోయినా 11 మంది ప్రజాపక్షం అనిపించుకోవాలని వైసీపీకి ఆమె సూచించారు. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ఎన్నికలకు వెళ్లండి. అప్పుడు ఎవరు ఇన్ సిగ్నిఫికెంట్.. ఎవరు ఇంపార్టెంట్ అన్నది తేలుతుంది కదా. వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి. లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపుపై చర్చించండి’’ అని అన్నారు.