Munaf Patel: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా మునాఫ్ పటేల్‌

Munaf Patel Joins Delhi Capitals As Bowling Coach For IPL 2025
  • గ‌త సీజ‌న్‌లో డీసీ బౌలింగ్ కోచ్‌గా జేమ్స్ హోప్స్ 
  • అత‌ని స్థానంలోనే ఇప్పుడు మునాప్ ప‌టేల్‌ ఎంపిక‌
  • హెడ్‌ కోచ్ హేమంగ్ బదానీ, డైరెక్టర్ వేణుగోపాల్ రావుతో కలిసి పని చేయ‌నున్న మునాఫ్‌
  • భార‌త్ త‌ర‌ఫున 86 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 125 వికెట్లు తీసిన సీమ‌ర్‌
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ మ‌రో కీల‌క నియామ‌కం చేప‌ట్టింది. త‌మ జ‌ట్టు బౌలింగ్ కోచ్‌గా భార‌త వెట‌ర‌న్ సీమ‌ర్‌ మునాఫ్ పటేల్‌ను నియ‌మించింది. 41 ఏళ్ల మునాఫ్ ప్రధాన కోచ్ హేమంగ్ బదానీ, డైరెక్టర్ వేణుగోపాల్ రావుతో కలిసి పని చేయ‌నున్నాడు. 

2018లో ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన మునాఫ్ తన కెరీర్‌లో తొలిసారిగా ఉన్నత స్థాయి కోచింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. 2024 ఐపీఎల్ సీజ‌న్‌లో డీసీ బౌలింగ్ కోచ్‌గా జేమ్స్ హోప్స్ ఉన్నాడు. అత‌ని స్థానంలోనే ఇప్పుడు మునాఫ్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు.

ఇక మునాఫ్ ప‌టేల్ భార‌త్ త‌ర‌ఫున అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 86 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 125 వికెట్లు పడగొట్టాడు. అతను 2011లో భారత ప్రపంచ కప్ గెలిచిన జట్టులో స‌భ్యుడు. అలాగే రాజస్థాన్ రాయల్స్ (2008), ముంబై ఇండియన్స్ (2013) త‌రఫున‌ రెండుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచాడు.

ఇదిలాఉంటే.. డీసీ 2025 సీజన్ కోసం నలుగురు ఆటగాళ్లను రిటెన్ష‌న్ చేసుకున్న విష‌యం తెలిసిందే. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్‌ల‌ను అట్టిపెట్టుకుంది. ఈ నెల 24, 25 తేదీల్లో జెడ్డాలో జరిగే మెగా వేలంలో ఫ్రాంచైజీకి రూ. 73 కోట్ల పర్స్‌తో పాల్గొన‌నుంది. అలాగే రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) కార్డుల ద్వారా మరో ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఆ జ‌ట్టుకు ఉంది. 
Munaf Patel
Delhi Capitals
Bowling Coach
IPL 2025
Cricket

More Telugu News