Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ఐసీసీ కొత్త ప్రణాళిక.. భారత్ మ్యాచ్‌లు ఎక్కడంటే..!

ICC Proposes India matches in UAE and the final in Dubai for ICC CT2025
  • టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడంపై అభిప్రాయం చెప్పాలని పీసీబీని కోరిన ఐసీసీ
  • భారత్ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని ప్రతిపాదన
  • స్పందించకుండా మౌనం వహించిన పీసీబీ
  • టోర్నీ ఆతిథ్యం నుంచి పాక్ వైదొలగితే దక్షిణాఫ్రికాకు తరలించే అవకాశాలు
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనేందుకు ఆతిథ్య దేశం పాకిస్థాన్‌కు భారత్ వెళ్లడంపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. భద్రతా కారణాల రీత్యా టీమిండియాను పాక్ పంపించబోమని బీసీసీఐ చెబుతోంది. ఈ మేరకు భారత్ అందించిన సమాచారాన్ని ఐసీసీ ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) తెలియజేసింది.

తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడంపై అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ పీసీబీని ఐసీసీ కోరినట్టు సమాచారం. ఈ విషయాన్ని పీసీబీ కూడా నిర్ధారించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం నుంచి వైదొలిగే ఉద్దేశం పాకిస్థాన్‌కు లేకుంటే భారత్ మ్యాచ్‌లను యూఏఈలో, ఫైనల్‌ మ్యాచ్‌ను దుబాయ్‌ నగరంలో నిర్వహించాలనేది ఐసీసీ ప్రణాళిక అని సంబంధిత వర్గాలు సోమవారం తెలిపాయి. ఫైనల్‌ మ్యాచ్‌ను పాకిస్థాన్‌లో కాకుండా దుబాయ్‌లో నిర్వహిస్తేనే తమకు ఆమోదయోగ్యమంటూ ఐసీసీకి బీసీసీఐ తెలిపిందని ప్రస్తావించారు. 

హైబ్రిడ్ విధానంలో పూర్తి హోస్టింగ్ ఫీజులను పీసీబీ తీసుకోవచ్చని, మ్యాచ్‌లలో ఎక్కువ భాగం పాక్‌లోనే నిర్వహించుకోవచ్చని ఐసీసీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఒకవేళ భారత్ తమ దేశానికి రాలేదనే కారణంతో ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం నుంచి వైదొలగాలని పాకిస్థాన్ నిర్ణయించుకుంటే... టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలింపు అంశాన్ని ఐసీసీ పరిగణనలోకి తీసుకునే సూచనలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా ఐసీసీ ప్రతిపాదనపై పీసీబీ ఎలాంటి స్పందనా లేకుండా మౌనం వహించింది. హైబ్రిడ్ మోడల్ గురించి అసలు చర్చించలేదని, ఐసీసీ నుంచి మరింత సమాచారం కోరే అవకాశం ఉందని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి.
Champions Trophy 2025
Cricket
Sports News
BCCI
ICC
PCB

More Telugu News