Revanth Reddy: నా పోటీ ఆంధ్రప్రదేశ్‌తో కాదు... బెంగళూరుతో పోటీపడితే మజా ఏముంటుంది?: రేవంత్ రెడ్డి

Revanth Reddy says he is not competing with Andhra Pradesh
  • న్యూయార్క్, సియోల్ సిటీలతో పోటీ అన్న సీఎం
  • బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై నగరాలతో పోటీ పడితే మజా ఏముంటుందని వ్యాఖ్య
  • 'నార్త్ సౌత్' కాదు... 'సౌత్ నార్త్' ఎందుకు అనడం లేదన్న రేవంత్ రెడ్డి
తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి విషయంలో తాను పోటీపడేది పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌లతో కాదని, న్యూయార్క్ సిటీ, సియోల్ వంటి నగరాలతోనే పోటీ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హైదరాబాద్‌ ప్రపంచ నగరాలతో పోటీ పడేలా ముందుకు సాగుతున్నామన్నారు.

బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై నగరాలతో పోటీ పడితే మజా ఉండనే ఉండదన్నారు. ప్రస్తుతం ప్రపంచం కుగ్రామంగా మారిపోయిందని, కాబట్టి ప్రపంచ నగరాలతో పోటీ పడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అదానీ పెట్టుబడులు పెడితే... అభివృద్ధి చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ఇతరుల చేతుల్లో ఉన్న వాటిని లాక్కొని అదానీకి ఇవ్వాలని తమకు లేదన్నారు. అదే బీజేపీకి, కాంగ్రెస్‌కు ఉన్న తేడా అన్నారు.

ఎన్నికలకు ముందు సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలు ఇచ్చారని, వాటిని క్రమంగా అమలు చేస్తున్నామన్నారు. తాను ఏడో గ్యారెంటీగా డెమోక్రసీని తిరిగి తెస్తానని ప్రజలకు హామీ ఇచ్చానన్నారు. అందుకే కేసీఆర్ మూసేసిన ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌ను తాను తెరిచానన్నారు. కేటీఆర్, హరీశ్ రావు కూడా అక్కడకు వచ్చి ధర్నా చేసేందుకు అవకాశం ఇచ్చానన్నారు.

2004-2014 వరకు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో గుజరాత్ మోడల్ ప్రచారం కోసం కేంద్రం తరపున పూర్తి సహకారం అందించారని, అందుకే ఆరోజు సీఎంగా ఉన్న మోదీ గుజరాత్‌ను అభివృద్ధి చేసుకోగలిగారన్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా అలాగే వ్యవహరించాలన్నారు. ప్రధాని మోదీ 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేస్తామని చెబుతున్నారని, మరి తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు లేకుండా ఎలా చేయగలుగుతారని ప్రశ్నించారు.

సౌత్ నార్త్ ఎందుకు అనడం లేదు?

మీడియా ప్రతినిధి 'నార్త్, సౌత్' అంటూ ఓ ప్రశ్న వేయగా... మీ ప్రశ్నలో వివక్ష ఉందని, 'నార్త్ సౌత్' కాదు... 'సౌత్ నార్త్' అని ఎందుకు అనడం లేదన్నారు. దానికి మీడియా ప్రతినిధి, ఓకే 'సౌత్ నార్త్' అని కరెక్ట్ చేసుకున్నారు. తెలంగాణ రూపాయి కేంద్రానికి ఇస్తే తమకు 40 పైసలు మాత్రమే వస్తున్నాయన్నారు. అదే బిహార్‌కు రూ.7, యూపీకి రూ.2కు పైగా పోతోందన్నారు. జనాభా ప్రాతిపదికన నిధులు వస్తున్నాయన్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై మౌనంగా ఎందుకు ఉండాలని ప్రశ్నించారు.
Revanth Reddy
Congress
Andhra Pradesh
Bengaluru

More Telugu News