Shahrukh Khan: షారూఖ్‌ఖాన్‌ను చంపేస్తానని బెదిరించిన లాయర్ అరెస్ట్

Lawyer who issued death threat to bollywood star Shah Rukh Khan arrested
  • చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • గతవారం బాంద్రా పోలీసులకు ఫోన్ చేసి రూ. 50 లక్షలు ఇవ్వకుంటే షారూఖ్‌ను చంపేస్తానని హెచ్చరిక
  • ఆ కాల్‌కు, తనకు సంబంధం లేదన్న లాయర్
  • తాను ఈ నెల 2నే ఫోన్ పోగొట్టుకున్నానని వెల్లడి
  • కావాలనే తనను ఇరికిస్తున్నారన్న ఫైజాన్‌ఖాన్
బాలీవుడ్ స్టార్ నటుడు షారూఖ్‌ఖాన్‌ను చంపేస్తానని బెదిరించిన చత్తీస్‌గఢ్ న్యాయవాది ఫైజాన్‌ఖాన్‌ను ముంబై పోలీసులు ఈ రోజు (మంగళవారం) అరెస్ట్ చేశారు. తనకు రూ. 50 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తానని షారూఖ్‌ను ఫైజాన్ బెదిరించారు. రాయపూర్‌లోని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 

ఫైజాన్ ఇటీవల మాట్లాడుతూ ఈ నెల 14న తాను ముంబై వచ్చి బాంద్రా పోలీసులకు వాంగ్మూలం ఇస్తానని పేర్కొన్నారు. అయితే, గత రెండు రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తుండడంతో ముంబై పోలీసు కమిషనర్‌కు లేఖ రాస్తూ తన వాంగ్మూలాన్ని వర్చువల్‌గా తీసుకోవాలని కోరారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి నటుడు సల్మాన్‌ఖాన్‌కు వరుస బెదిరింపుల నేపథ్యంలో షారూఖ్‌కు కూడా బెదిరింపులు రావడం కలకలం రేపింది. 

షారూఖ్ తనకు రూ.50 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తానంటూ గతవారం బాంద్రా పోలీస్ స్టేషన్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు దోపిడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫైజాన్‌ఖాన్ పేరుతో రిజస్టర్ అయిన ఫోన్ నంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ముంబై పోలీసు బృందం రాయ్‌పూర్ వెళ్లి ఫైజాన్‌కు సమన్లు ఇచ్చింది. అయితే, ఆ బెదిరింపు కాల్‌కు, తనకు సంబంధం లేదని, ఈ నెల 2నే తాను ఫోన్ పోగొట్టుకున్నానని, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు. 

తన నంబర్ నుంచి బెదిరింపు కాల్ చేయడం వెనక కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు, రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేందుకు కారణమయ్యారంటూ షారూఖ్‌పై బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. షారూఖ్‌కు బెదిరింపుల కేసులో తనను ఇరికించారని ఆరోపించారు. 
Shahrukh Khan
Bollywood
Threat Call
Chhattisgarh

More Telugu News