KTR: అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరు: కేటీఆర్‌

BRS Working President KTR Tweet on Lagacharla Incident
  • వికారాబాద్‌ జిల్లా లగచర్లలో ఉద్రిక్త పరిస్థితి 
  • జిల్లా కలెక్టర్‌తో పాటు అధికారులపై దాడి ఘటనలో 30 మంది అరెస్టు 
  • ఈ అరెస్టుల‌పై ఎక్స్ వేదిక‌గా స్పందించిన కేటీఆర్‌
  • బెదిరింపులతో రైతులను భయపెట్టలేరంటూ ట్వీట్
వికారాబాద్‌ జిల్లా లగచర్లలో జిల్లా కలెక్టర్‌తో పాటు అధికారులపై దాడి ఘటనలో 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి వేళ లగచర్లలో భారీగా మోహరించిన పోలీసులు.. కరెంటు తీసేసి మ‌రీ ప్రతి ఇంటిని జల్లడపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ అర్ధ‌రాత్రి అరెస్టుల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరు.. బెదిరింపులతో రైతులను భయపెట్టలేరంటూ ఆయ‌న ట్వీట్ చేశారు. 

అర్ధరాత్రి 300 మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా? అంటూ ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ప్ర‌శ్నించారు. రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదేనా ప్రజాస్వామ్య పాలనా?  రైతు సంక్షేమ పాలన? ఇదేనా వెలుగులను తరిమేసి.. చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం! అంటూ నిల‌దీశారు. 

ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి.. పచ్చని పొలాలను వల్లకాడు చేయవద్దన్నందుకు అర్ధరాత్రి అన్నదాతల అరెస్టులా? అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మీ అల్లుడు, సోదరుల సంపాదనల కోసం.. భూమిని నమ్ముకున్న రైతులు మా పొట్ట కొట్టవద్దన్నందుకు అరెస్టులా? అని ప్ర‌శ్నించారు. 

రైతుల అరెస్టులను ఖండిస్తున్నామ‌ని, పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తున్నామ‌ని తెలిపారు. అలాగే లగచర్ల గ్రామస్తుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. 
KTR
BRS
Telangana

More Telugu News