Chandrababu: పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు మేధోమథనం... డీటెయిల్స్ ఇవిగో!

CM Chandrababu chaired Vision 2047 Task Force Committee first meeting
  • చంద్రబాబు అధ్యక్షతన విజన్-2047 టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం
  • 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ఏపీ ప్రభుత్వ ప్రణాళిక
  • అవకాశాల కల్పనతో సంపద సృష్టి జరుగుతుందన్న చంద్రబాబు
  • విజన్-2047 లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
రానున్న రోజుల్లో 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళికలు అమలు చేసి ఫలితాలు సాధిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అవకాశాల కల్పనతో సంపద సృష్టి సాధ్యం అవుతుందని... తద్వారా వచ్చిన సంపదను పేద వర్గాలకు పంచి ప్రజల జీవన ప్రమాణాలు పెంచవచ్చని తెలిపారు. 

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 13.5 శాతం వృద్ధి రేటు సాధించామని...నేడు 15 శాతం వృద్ధి రేటు సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. దీనికి అసవరమైన ప్రణాళికలు, పాలసీలను ప్రభుత్వం అమలు చేస్తుందని సీఎం తెలిపారు. 

స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047పై సచివాలయంలో పారిశ్రామిక వేత్తలతో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీ.ఎం రావు, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్ సుబ్రహ్మణ్యన్, టీవీఎస్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్, అపోలో ప్రతినిధి ప్రీతారెడ్డి, పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్, రెడ్డీ ల్యాబరేటరీస్ చైర్మన్ సతీష్ రెడ్డితో పాటు పలు ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

విజన్-2047 లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై పారిశ్రామిక దిగ్గజాలతో ముఖ్యమంత్రి మేధోమథనం చేశారు. చంద్రబాబు అధ్యక్షతన విజన్-2047పై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ తొలి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. 

ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ గా సీఎం చంద్రబాబు, కో ఛైర్మన్ గా టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ఉన్నారు. సచివాలయంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, సీఐఐ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు హాజరయ్యారు. విజన్-2047పై ప్రభుత్వ ఆలోచనలు, పాలసీలను చంద్రబాబు వారితో పంచుకున్నారు. వివిధ రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలు, సలహాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉత్తమ పాలసీలపై తన ఆలోచనలు, అనుభవాలు చెప్పారు. 

"ఇప్పుడు టెక్నాలజీ మరింత అడ్వాన్స్డ్ గా ఉంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. యువతకు అవకాశాలు కల్పిస్తే తిరుగులేని ఫలితాలు వస్తాయి. ఏపీలో సహజ వనరులు, మానవ వనరులు, మౌళిక సదుపాయాలు, హైవేలు, ఎయిర్ పోర్టులు ఉన్నాయి. కొత్త ఆవిష్కరణలకు, కొత్త ఆలోచనలకు మేం వేదికగా ఉండాలి అనుకుంటున్నాం. నాడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడాం... ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం” అని సీఎం అన్నారు. 

నాడు ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలనే లక్ష్యంతో పని చేశామని... నేడు ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవసరమైన భూములు, నీళ్లు, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని... వీటికి తోడు బెస్ట్ పాలసీలు కూడా ప్రకటించామని సీఎం తెలిపారు. వీటి ద్వారా పారిశ్రామిక రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.
Chandrababu
Vision-2047
Task Force
Meeting
Amaravati
Andhra Pradesh

More Telugu News