Viral Video: లెబనాన్‌లో సమాధుల కింద హిజ్బుల్లా భారీ సొరంగం.. గుర్తించిన ఇజ్రాయెల్.. వీడియో ఇదిగో!

Israel finds massive Hezbollah tunnel under cemetery in Lebanon
  • లెబనాన్‌పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు
  • సరిహద్దుకు 1.5 కిలోమీటర్ల దూరంలో సమాధుల కింద భారీ సొరంగ నిర్మాణం 
  • అందులో కమాండ్ కంట్రోల్ రూములు, తుపాకులు, రాకెట్ లాంచర్లు
  • ధ్వంసం చేసినట్టు పేర్కొన్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్
లెబనాన్‌లో సమాధుల కింద ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా నిర్మించిన భారీ సొరంగాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ (ఐడీఎఫ్) గుర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. కిలోమీటర్‌కు పైగా పొడవున్న ఈ సొరంగం సరిహద్దు నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సొరంగ నిర్మాణం కోసం దాదాపు 4,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను ఉపయోగించి ఉంటారని ఐడీఎఫ్ అంచనా వేసింది. 

ఈ వీడియోను షేర్ చేసిన ఇజ్రాయెల్ ఆర్మీ.. ఇలాంటి ఎన్నో టన్నెళ్లను ధ్వంసం చేసినట్టు పేర్కొంది. ఈ సొరంగంలో కమాండ్ కంట్రోల్ రూములు, తుపాకులు, రాకెట్ లాంచర్లు, స్లీపింగ్ క్వార్టర్లు, డజన్ల కొద్దీ ఆయుధాలు, ఇతర సామగ్రి ఉన్నట్టు తెలిపింది. దక్షిణ లెబనాన్‌లోని గ్రామాల్లో హిజ్బుల్లా ఇలాంటి సొరంగాలను నిర్మించినట్టు వివరించింది.  

మరోవైపు, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 3,186 మంది ప్రాణాలు కోల్పోయారు. 14,078 మంది గాయపడ్డారు. శనివారం ఒక్క రోజే 53 మంది మరణించారు. 
Viral Video
Israel
Lebanon
Hezbollah
Tunnel
Cemetery

More Telugu News