Mohammad Rizwan: ఒకే ఇన్నింగ్స్‌లో 6 క్యాచ్‌లు ప‌ట్టిన‌ పాక్ కెప్టెన్ రిజ్వాన్.. ప్ర‌పంచ రికార్డు స‌మం!

Pakistan captain Mohammad Rizwan takes six catches in ODI against Australia levels world record
  • అడిలైడ్ ఓవల్‌లో ఆసీస్‌, పాక్ వ‌న్డే మ్యాచ్‌
  • ఒకే వన్డే ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లు పట్టిన 12వ ఆటగాడిగా రిజ్వాన్
  • అంత‌కుముందు డి కాక్, సర్ఫరాజ్ అహ్మద్, బట్లర్, గిల్‌క్రిస్ట్ ఈ ఫీట్‌
  • ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసిన పాకిస్థాన్‌
పాకిస్థాన్ వైట్‌బాల్‌ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఆస్ట్రేలియాతో జరిగిన వ‌న్డే మ్యాచ్‌లో అద‌ర‌గొట్టాడు. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు ప‌ట్టిన వికెట్ కీప‌ర్‌గా ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఈ ప్రత్యేకమైన క్లబ్‌లో చేరిన తొమ్మిదో వికెట్ కీపర్‌గా నిలిచాడు. 

శుక్రవారం అడిలైడ్ ఓవల్‌లో ఆసీస్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో పాకిస్థాన్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ ఏకంగా ఆరు క్యాచ్‌లు అందుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్ల‌లో ఏడుగురు క్యాచ్ ఔట్ కాగా, ఆరుగురు రిజ్వాన్‌కే చిక్క‌డం విశేషం. త‌ద్వారా ఒకే వన్డే ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లు పట్టిన 12వ ఆటగాడిగా రిజ్వాన్ నిలిచాడు. అంత‌కుముందు క్వింటన్ డి కాక్, సర్ఫరాజ్ అహ్మద్, జోస్ బట్లర్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఈ ఫీట్‌ను అందుకున్నారు. 

ఇక ఈ రెండో వ‌న్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జ‌ట్టు 163 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. పాక్ పేస‌ర్ హారిస్ రౌఫ్ నిప్పులు చెరిగే బంతుల‌తో ఆసీస్ బ్యాట‌ర్ల‌ను బెంబేలెత్తించాడు. ఐదు వికెట్లు తీసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను శాసించాడు. 

ఆ తర్వాత 164 ప‌రుగుల‌ స్వ‌ల్ప‌ ల‌క్ష్య‌ఛేద‌న‌కు దిగిన‌ పాకిస్థాన్‌ 141 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఘ‌న‌ విజయం సాధించింది. పాక్ ఓపెన‌ర్లు సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్ 137 ప‌రుగుల‌ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించింది.

ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో మెన్ ఇన్ గ్రీన్ ఆస్ట్రేలియాతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. సిరీస్ ఫ‌లితాన్ని తేల్చే నిర్ణయాత్మకమైన చివ‌రి వ‌న్డే ఆదివారం జ‌ర‌గ‌నుంది. కాగా, 1996 తర్వాత ఆస్ట్రేలియాపై అడిలైడ్‌లో పాకిస్థాన్ గెల‌వ‌డం ద్వారా చరిత్రను తిర‌గ‌రాసింది.
Mohammad Rizwan
Pakistan
ODI
Australia
Cricket
Sports News

More Telugu News