Sanju Samson: దక్షిణాఫ్రికాపై సెంచరీతో చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. రెండు రికార్డులు సొంతం

Sanju Samson has become first Indian batter to hit centuries in back to back in T20Is
  • టీ20ల్లో వరుసగా సెంచరీలు సాధించిన భారతీయ క్రికెటర్‌గా నిలిచిన సంజూ శాంసన్
  • ఒక టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ ఆటగాడిగానూ రికార్డు
  • డర్బన్ టీ20లో చెలరేగి 47 బంతుల్లోనే సెంచరీ చేసిన స్టార్ బ్యాటర్
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సంజూ శాంసన్ అలవోకగా సెంచరీ బాదడంతో భారత్ గెలుపు సునాయాసమైంది. ఈ మ్యాచ్‌లో 47 బంతుల్లోనే సంజూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 50 బంతులు ఎదుర్కొని 107 పరుగులు సాధించాడు. ఏకంగా 10 సిక్సర్లు, 7 ఫోర్లు బాదాడు. దీంతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కూడా దక్కించుకున్నాడు. కాగా ఈ శతకంతో శాంసన్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు.

టీ20 క్రికెట్‌లో వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో కూడా సంజూ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో 47 బంతుల్లోనే 111 పరుగులు చేశాడు. కెరీర్‌లో అది తొలి సెంచరీ కాగా.. దక్షిణాఫ్రికాపై తాజాగా సాధించింది రెండవది.

అంతర్జాతీయంగా చూస్తే.. ఇంగ్లండ్‌ బ్యాటర్ ఫిల్ సాల్ట్, దక్షిణాఫ్రికాకు చెందిన ప్లేయర్ రిలీ రోసో, ఫ్రాన్స్‌కు చెందిన గుస్తావ్ మెకియోన్ మాత్రమే టీ20లలో వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో నాలుగవ ఆటగాడిగా సంజూ శాంసన్ నిలిచాడు. మరోవైపు ఒక టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ క్రికెటర్‌గా రోహిత్ శర్మతో సమంగా సంజూ నిలిచాడు. దక్షిణాఫ్రికాపై చెలరేగి 10 సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే.
Sanju Samson
Team India
Cricket
India Vs South Africa

More Telugu News