Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆసీస్ దిగ్గజం గ్రెగ్ చాపెల్

Greg Chappell has opened the Virat Kohli and Rohit Sharma ahead of the Border Gavaskar Trophy
  • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు అసలుసిసలైన పరీక్ష అని విశ్లేషించిన ఆసీస్ మాజీ దిగ్గజం
  • వారసత్వాన్ని నిర్ణయించే సిరీస్ అని విశ్లేషణ
  • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌లకు కాలంతో అసలుసిసలైన యుద్ధమని వ్యాఖ్య
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నవంబర్ 22 నుంచి జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ఫామ్‌పై చర్చ నడుస్తోంది. న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇద్దరూ దారుణంగా విఫలమవ్వడమే ఇందుకు కారణంగా ఉంది. స్వదేశంలో గత పది ఇన్నింగ్స్‌లలో  కోహ్లీ 192, రోహిత్  133 పరుగులు మాత్రమే సాధంచారు. దీనిని బట్టి వీరిద్దరూ ఎంత పేలవమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఫామ్‌‌లోకి రాలేక సతమతమవుతున్న వీరిద్దరిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం గ్రెగ్ చాపెల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

ఇటీవల తాను ఔట్ అవుతున్న తీరు పట్ల విరాట్ కోహ్లీ విసుగు చెంది ఉంటాడని, అయితే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పరుగుల దాహంతో ఆడే అవకాశం ఉందని ఆస్ట్రేలియా ఆటగాళ్లను చాపెల్ హెచ్చరించారు. ‘‘ కోహ్లీ విషయానికి వస్తే.. అతడు తిరిగి పుంజుకోవాలి. అసమానమైన ప్రతిభ, అంకితభావం, అత్యున్నత ప్రమాణాలకు మారుపేరైన కోహ్లీకి ఇటీవలి చెత్త ప్రదర్శన చిరాకు కలిగిస్తుంది. అయితే కోహ్లీని గొప్ప ఆటగాడిగా నిలిపిన దూకుడుకి ఇప్పుడు సహనం, ఫోకస్ తోడవుతాయి. ప్రస్తుత తరంలో గొప్ప ఆటగాడినని చాటిచెప్పేందుకు కోహ్లీ పరుగుల దాహంతో ఈ సిరీస్‌లో అడుగుపెడతాడు’’ అని గ్రెగ్ చాపల్ అన్నారు. ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌’కి రాసిన కాలమ్‌లో ఆయన పేర్కొన్నారు.

ఇక రోహిత్ శర్మ విషయానికొస్తే... భారత కెప్టెన్ ముందుండి జట్టుని నడిపించాల్సి ఉంటుందని చాపెల్ అభిప్రాయపడ్డారు. ‘‘కెప్టెన్‌గా నాయకత్వం ఒత్తిడిని ఎదుర్కొంటూ వ్యక్తిగత ఫామ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. భారత్ రాణించాలంటే రోహిత్ శర్మ బ్యాలెన్స్ చేసుకొని ఆడాలి. ఈ టెస్ట్ సిరీస్ క్రికెట్‌లో మరో అధ్యాయం కంటే ఎక్కువని చెప్పాలి. ఎందుకంటే అత్యంత నైపుణ్యం కలిగిన ఆటగాళ్లకు ఇది పరీక్ష’’ అని చాపెల్ వ్యాఖ్యానించారు. 
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వారసత్వాన్ని బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నిర్వచిస్తుందని అన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌లకు కాలంతో అసలుసిసలైన యుద్ధమని అన్నారు.
Rohit Sharma
Virat Kohli
Greg Chappell
Cricket
india vs Australia

More Telugu News