Saudi Arabia: సౌదీ ఎడారిలో హిమపాతం.. చరిత్రలో కనీవినీ ఎరుగని విచిత్ర వాతావరణం

Saudi Arabia witnessed heavy rains and snowfall for the first time ever
  • ఏడాదంతా పొడిగా ఉండే అల్-జాఫ్ ప్రాంతంలో భారీ హిమపాతం
  • నేల, రోడ్లపై పేరుకుపోయిన మంచు
  • ఎప్పుడూ చూడని దృశ్యాలను చూసి ఆశ్చర్యపోతున్న స్థానికులు
  • వైరల్‌గా మారిన ఫొటోలు, వీడియోలు
గల్ఫ్ దేశం సౌదీ అరేబియాలో ఎండలు తీవ్రంగా ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ప్రస్తుతం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ఎడారిలోని పలు ప్రాంతాల్లో భారీగా హిమపాతం పడుతోంది. నేలపై తెల్లగా పేరుకుపోయిన మంచు స్థానికులను అమితాశ్చర్యానికి గురిచేస్తోంది. శీతాకాలం రాకముందే మంచు కురుస్తోందని స్థానికులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇటీవల భారీగా వర్షాలు పడ్డాయని, ఇప్పుడు మంచు కురుస్తోందంటూ స్థానికులు సోషల్ మీడియా వేదికగా ఫొటోలు, వీడియోలు షేర్ చేశారు.

అల్-జాఫ్ ప్రాంతంలో భారీ హిమపాతం నమోదవుతున్నట్టు చెబుతున్నారు. నిజానికి అల్-జాఫ్ ప్రాంతం ఏడాదంతా పొడిగా ఉంటుంది. శుష్క వాతావరణానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో వర్షాలు, మంచు అస్సలు పడవు. కానీ చరిత్రలో తొలిసారి అక్కడ మంచు కురుస్తోంది. ఇది అక్కడి వాతావరణంలో సరికొత్త అధ్యయనమని నిపుణులు అంటున్నారు.

ఇటీవల నమోదయిన భారీ వర్షపాతం మంచు కురవడానికి కారణమని, భారీ వర్షాలు సుందరమైన జలపాతాలను కూడా సృష్టించిందని సౌదీ వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు, వడగళ్లు పడతాయని హెచ్చరించారు. ఈ తుఫానులకు తోడు బలమైన గాలులు వీస్తాయని అప్రమత్తం చేశారు. రోడ్లపై వాహనాల్లో ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కాగా అసాధారణ ఈ వాతావరణం కేవలం సౌదీ అరేబియాలోనే కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (యూఏఈ) కూడా ఉంది. అక్టోబర్ 14న యూఏఈ వాతావరణ సంస్థ ఊహించిన దాని కంటే ఎక్కువ వర్షపాతం నమోదయింది. ఉరుములు, మెరుపులతో పాటు అనేక ప్రాంతాల్లో వడగళ్లు పడ్డాయి.
Saudi Arabia
Snowfall
Viral News
Viral Videos

More Telugu News