Viral News: లంచ్ బాక్స్ మరచిపోయారంటూ ఆఫీస్‌కు వెళుతున్న భర్తకు భార్య ఫోన్.. అదృష్టం తలుపు తట్టింది

Call from wife lead a man to win 3 million dollars in USA
  • లంచ్‌కు ఏమైనా దొరుకుందేమోనని షాపు‌కు వెళ్లి లాటరీ టికెట్ కొన్న వ్యక్తి
  • వరించిన రూ.25.24 కోట్ల అదృష్టం
  • సంతోషంలో ఎగిరి గంతేసిన సాధారణ ఉద్యోగి
లంచ్ బాక్స్ మరచిపోయారంటూ ఆఫీస్‌కు వెళుతున్న ఓ వ్యక్తికి అతడి భార్య ఫోన్ చేసి చెప్పడం వారి తలరాతనే మార్చేసింది. అదృష్టవంతులను చేసింది. ఏకంగా కోటీశ్వరులుగా మార్చివేసింది. అమెరికాలో జరిగిన ఆసక్తికరమైన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మిస్సోరికి చెందిన ఓ సాధారణ ఉద్యోగిని ఏకంగా 3 మిలియన్ డాలర్ల లాటరీ (సుమారు రూ.25.24 కోట్లు) వరించింది. లాటరీ విజేత ఆ రోజు ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు లంచ్ బాక్స్ మరచిపోయి బయలుదేరాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత భార్య ఫోన్ చేసి లంచ్ బాక్స్ మరచిపోయారంటూ చెప్పింది. అయితే బాక్స్ కోసం వెనక్కి వెళితే ఆఫీస్‌కు చేరుకోవడం ఆలస్యం అవుతుందని భావించి.. మధ్యాహ్నం తినడానికి ఏమైనా దొరుకుతుందేమో చూసేందుకు దగ్గరలోనే ఉన్న కిరాణా దుకాణానికి వెళ్లాడు. 

అయితే ఆ దుకాణం వద్ద అతడికి ‘మిలియనీర్ బక్స్’ స్క్రాచర్స్ గేమ్‌ లాటరీ కనిపించింది. గరిష్ఠ బహుమతి 3 మిలియన్ డాలర్లు అని రాసి ఉండడాన్ని చూశాడు. 60 డాలర్లు పెట్టి ఒక టికెట్ కొనుగోలు చేశాడు. కార్డు స్కాన్ చేసి చూస్తే డిస్‌ప్లేపై విజేత అని ఉంది. తొలుత నమ్మలేకపోయాడు. కాస్త తేరుకున్నాక ఆనందంతో ఎగిరి గెంతేశాడు. ‘‘నేను సాధారణంగా 30 డాలర్ల టిక్కెట్‌లను కొనుగోలు చేయను. ఇంతకు ముందు కొన్ని ఇతర స్క్రాచర్స్ టిక్కెట్‌లపై గెలిచి ఉండడంతో మళ్లీ 60 డాలర్లతో టికెట్ కొనాలని అనుకున్నాను. టికెట్‌ను స్కాన్ చేసి చూస్తే విజేత అని ఉంది’’ అని ఉద్యోగి అమితానందం వ్యక్తం చేశాడు.

తాను పూర్తిగా ఆశ్చర్యపోయానని, నమ్మలేకపోయానని ఆనందాన్ని పంచుకున్నాడు. వెంటనే భార్యకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పానని చెప్పాడు. భార్యను ఆట పట్టించడం తనకు అలవాటు అని, అందుకే లాటరీ గెలుచుకున్న విషయాన్ని నమ్మించడానికి కొంత సమయం పట్టిందని చెప్పాడు.
Viral News
Missouri Lottery
USA
Off Beat News

More Telugu News