Satellite Phone: చెన్నై ఎయిర్ పోర్టులో శాటిలైట్ ఫోన్ తో పట్టుబడిన అమెరికా జాతీయుడు

American national detained in Chennai airport for having satellite phone
  • భారత్ లో వ్యక్తిగత అవసరాలకు శాటిలైట్ ఫోన్లు వాడడం నిషిద్ధం
  • 26/11 ఉగ్రదాడుల అనంతరం కేంద్రం కీలక నిర్ణయం
  • చెన్నై నుంచి సింగపూర్ వెళుతున్న అమెరికన్ వద్ద శాటిలైట్ ఫోన్ గుర్తింపు
ఓ అమెరికా పౌరుడు ఇవాళ చెన్నై ఎయిర్ పోర్టులో శాటిలైట్ ఫోన్ తో పట్టుబడ్డాడు. అతడి పేరు డేవిడ్ (55). ఈ వేకువ జామున సింగపూర్ వెళుతుండగా అతడి వద్ద శాటిలైట్ ఫోన్ ఉన్నట్టు సీఐఎస్ఎఫ్ బలగాలు గుర్తించాయి. దాంతో ఆ అమెరికా జాతీయుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు, అతడి నుంచి శాటిలైట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, విచారణ కోసం ఆ వ్యక్తిని ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. 

తాను అమెరికా నుంచి న్యూఢిల్లీ వచ్చానని, ఆ తర్వాత అండమాన్ వెళ్లానని, కానీ ఎవరూ శాటిలైట్ ఫోన్ గురించి ప్రశ్నించలేదని ఆ వ్యక్తి తెలిపాడు. 

భారత్ లో శాటిలైట్ ఫోన్లు వ్యక్తిగతంగా వినియోగించడం నిషిద్ధమని, దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టుల్లో వాటిపై నిషేధం ఉందని చెన్నై ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. 

26/11 ముంబయి ఉగ్రదాడుల సమయంలో టెర్రరిస్టులు శాటిలైట్ ఫోన్ల ద్వారానే సమన్వయం చేసుకుంటూ నరమేధం సృష్టించారు. అప్పటి నుంచి కేంద్ర హోంశాఖ, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీఏసీఎస్) దేశంలో శాటిలైట్ ఫోన్లను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడంపై నిషేధం విధించాయి. కేంద్ర ప్రభుత్వం, టెలికాం శాఖ నుంచి ప్రత్యేక అనుమతులు ఉంటేనే భారత్ లో శాటిలైట్ ఫోన్లు ఉపయోగించడం సాధ్యపడుతుంది.
Satellite Phone
American National
Chennai Airport
India

More Telugu News