New Zealand: ముంబయి టెస్టులోనూ టీమిండియా కుదేల్... చరిత్ర సృష్టించిన కివీస్

Kiwis creates history by white wash India on their home soil
  • మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా
  • 3-0 తో వైట్ వాష్ చేసిన న్యూజిలాండ్ 
  • సొంతగడ్డపై భారత్ ను వైట్ వాష్ చేసిన తొలి జట్టుగా రికార్డు
ఏమాత్రం అంచనాల్లేకుండా భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టు చివరికి చరిత్ర సృష్టించింది. వరుసగా మూడు టెస్టుల్లోనూ టీమిండియాను చిత్తు చేసి, ఓ టెస్టు సిరీస్ లో సొంతగడ్డపై టీమిండియాను వైట్ వాష్ చేసిన తొలి జట్టుగా రికార్డు నమోదు చేసింది. 

గతంలో పలు జట్లు భారత గడ్డపై టెస్టు సిరీస్ లు గెలిచాయి కానీ, ఇలా ఓ సిరీస్ లో అన్ని టెస్టులు గెలిచింది లేదు. కానీ, కొత్త కెప్టెన్ టామ్ లాథమ్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో భారత్ ను భారత్ లోనే ఓడించడమే కాదు, మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి చరిత్ర పుటల్లోకెక్కింది. 

ఇవాళ ముగిసిన మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో జయభేరి మోగించిన న్యూజిలాండ్ సిరీస్ ను 3-0తో కైవసం చేసుకుంది. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే గెలుపు దక్కుతుందనగా.... టీమిండియా 29.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. రిషబ్ పంత్ 64 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 11, వాషింగ్టన్ సుందర్ 12 పరుగులు చేశారు. మిగతా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు. 

న్యూజిలాండ్ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ రెండో ఇన్నింగ్స్ లోనూ అద్భుతంగా రాణించి 6 వికెట్లు పడగొట్టడం విశేషం. పార్ట్ టైమ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లు తీయగా, పేసర్ మాట్ హెన్రీకి ఓ వికెట్ దక్కింది. 

ముంబయి టెస్టులో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టు 235 పరుగులు చేయగా... టీమిండియా 263 పరుగులు చేసి 28 పరుగుల ఆధిక్యం అందుకుంది. రెండో ఇన్నింగ్స్ లో కివీస్ 174 పరుగులు చేశారు. కానీ, టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక మరోసారి తీవ్రంగా నిరాశపరిచింది.
New Zealand
Team India
White Wash
Test Series

More Telugu News