Tirumala: తిరుమలలో ఒకరోజు అన్నప్రసాద వితరణ చేయాలంటే ఎన్ని లక్షలు డొనేట్ చేయాలో తెలుసా?

How much money to donate to TTD for one day Anna Prasada seva
  • ఒక రోజంతా అన్న ప్రసాద వితరణ కోసం రూ. 44 లక్షలు చెల్లిస్తే సరి
  • రూ. 10 లక్షలు చెల్లిస్తే ఉదయం అల్పాహారం
  • రూ. 17 లక్షల చొప్పున చెల్లిస్తే మధ్యాహ్నం, రాత్రి భోజనాలు
  • దాతలకు స్వయంగా వడ్డించే అవకాశం 
  • రోజుకు దాదాపు 2.5 లక్షల మందికి అన్నదానం
తిరుమల శ్రీవారి కరుణాకటాక్షాల కోసం నిత్యం లక్షలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఎంతోమంది భక్తులు మొక్కుల రూపంలో స్వామి వారికి కానుకలు సమర్పించుకుంటారు. కొందరు మాత్రం భక్తుల అల్పాహారం, అన్న ప్రసాదాల కోసం విరాళం ఇస్తుంటారు. మరెంతోమంది విరాళం ఇవ్వాలనుకుంటారు. అయితే, దేనికి ఎంతమొత్తం ఇవ్వాలన్న విషయం తెలియక సతమతమవుతుంటారు.  

ఇలాంటి వారికోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం ప్రారంభించింది. ఒక రోజంతా పూర్తిగా అన్న ప్రసాద వితరణ కోసం రూ. .44 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. ఉదయం అల్పాహారం కోసం మాత్రమే అయితే రూ. 10 లక్షలు, మధ్యాహ్నభోజనం కోసం మాత్రమే అయితే రూ 17 లక్షలు, రాత్రి భోజనం కోసం అయితే రూ. 17 లక్షలు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు, దాతలు స్వయంగా వడ్డించే అవకాశం కూడా లభిస్తుంది. 

విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. దాతల తమ కోరిక మేరకు ఒకరోజు అక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందొచ్చు. ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2లోని కంపార్ట్‌మెంట్లు, బయటి క్యూలైన్‌లు, పీఏసీ-4(పాత అన్నప్రసాదం ), పీఏసీ-2, తిరుపతిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీనివాసం, విష్ణు నివాసం కాంప్లెక్సులు, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆసుపత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది.

తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలోనూ అన్నప్రసాదాలు అందిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్‌మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కల్యాణకట్టలలో టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు అందిస్తున్నారు. టీటీడీ  అన్న ప్రసాద విభాగం ప్రస్తుతం తిరుమల తిరుపతిలలో రోజుకు దాదాపు 2.5 లక్షల మందికి అన్న ప్రసాద వితరణ ( టీ, కాఫీలు, పాలు కలిపి) చేస్తోంది.  
Tirumala
Tirupati
Anna Prasadm
TTD

More Telugu News