Revanth Reddy: చంద్రబాబును ఫినిష్ చేసిన రేవంత్ రెడ్డి... కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయడం ఖాయం: దాసోజు శ్రవణ్

Dasoju Sravan says Revanth Reddy will finish congress in Telangana
  • ఓటుకు నోటు కేసుతో తెలంగాణలో చంద్రబాబును ఫినిష్ చేశాడన్న శ్రవణ్
  • కాంగ్రెస్‌లోకి వచ్చి ఉత్తమ్ కుమార్, మధుయాష్కీని ఫినిష్ చేశాడని వ్యాఖ్య
  • ఆయన భాషతో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారన్న దాసోజు శ్రవణ్
ఓటుకు నోటు కేసు ద్వారా తెలంగాణలో చంద్రబాబును ఫినిష్ చేసింది రేవంత్ రెడ్డేనని... ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన త్వరలో భూస్థాపితం చేయడం ఖాయమని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు చాలామంది సీనియర్ నాయకులను ఫినిష్ చేసిన రేవంత్... కాంగ్రెస్‌లోకి వచ్చాక ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ వంటి సీనియర్ నాయకులను ఫినిష్ చేశాడన్నారు. బీఆర్ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... సీఎం స్థాయిలో ఉండి కేసీఆర్‌ను ఫినిష్ చేస్తామని మాట్లాడటం ఏమిటన్నారు.

కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి భస్మాసురుడిలా తయారయ్యాడన్నారు. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. ఆయన భాష ఇలాగే ఉంటే... ఆయన నెగిటివ్ మనస్తత్వం ఇలాగే ఉంటే... కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తారని మంత్రులు, కాంగ్రెస్ క్రియాశీలక కార్యకర్తలు, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ గుర్తించాలన్నారు. వారు ఇప్పటికైనా నిద్రలేచి రేవంత్ రెడ్డికి గడ్డి పెట్టాలని సూచించారు. "రాజ్యాంగంపై గౌరవం ఉన్నవారు ఎవరూ వాళ్లను ఫినిష్ చేస్తాం... వీళ్లను ఫినిష్ చేస్తాం" అని మాట్లాడరన్నారు. సీఎం స్థాయిలో ఉండి అలా మాట్లాడటం ఏమిటన్నారు.

తెలంగాణ వ్యతిరేకులు కూడా కేసీఆర్‌ను ఫినిష్ చేస్తామని చెప్పలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇంకా ఫ్యాక్షన్‌ బుద్ధులు పోలేదన్నారు. రేవంత్ రెడ్డి కాదు... పెయింటర్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. నువ్వు ఆంధ్రా నాయకుల బూట్లు మోస్తున్నప్పుడే కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడాడని గుర్తు చేశారు. తెలంగాణ ప్రదాతపై దుర్మార్గమైన భాష మాట్లాడటం సిగ్గుచేటు... దమ్ముంటే కేసీఆర్‌తో రాజకీయంగా కొట్లాడాలని సవాల్ చేశారు.

రేవంత్ రెడ్డి కూర్చుంటున్న సచివాలయం కట్టింది... ఆయన తిరుగుతున్న రోడ్లు వేసింది... తాగుతున్న నీళ్లు ఇచ్చింది కేసీఆరే అన్నారు. కేసీఆర్ కృషి వల్ల తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ అయిందన్నారు. రేవంత్ రెడ్డి భాష చూస్తుంటే అసలు అన్నం తింటున్నాడా? గడ్డి తింటున్నాడా? అనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy
Dasoju Sravan
Chandrababu

More Telugu News