Salman Khan: రూ. 2 కోట్లు ఇస్తావా?.. చస్తావా?.. సల్మాన్‌ఖాన్‌కు మళ్లీ బెదిరింపులు

Pay Rs 2 crore or get killed Fresh death threat to bollywood actor Salman Khan
  • సల్మాన్ నుంచి రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసుకు మెసేజ్
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
  • సల్మాన్, జీషన్‌ను బెదిరించిన మరో కేసులో నిందితుడిని నోయిడాలో అరెస్ట్ చేసిన పోలీసులు
బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్‌ఖాన్‌కు మరోమారు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ముంబై ట్రాఫిక్ పోలీస్‌కు మెసేజ్ చేస్తూ.. సల్మాన్ రూ. 2 కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. లేదంటే చంపేస్తామని బెదిరించాడు. వెంటనే అప్రమత్తమైన వర్లి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

సల్మాన్‌ఖాన్, ఇటీవల హత్యకు గురైన మాజీమంత్రి బాబా సిద్దిఖీ కుమారుడు జీషన్ సిద్దిఖీని చంపేస్తామని బెదిరించిన 20 ఏళ్ల నిందితుడిని పోలీసులు నిన్న నోయిడాలో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై ముంబై తీసుకొచ్చారు. నిందితుడిని మహమ్మద్ తయ్యబ్ అలియాస్ గుర్ఫాన్‌ఖాన్‌గా గుర్తించారు. గుర్ఫాన్ కూడా సల్మాన్, జీషన్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు.

దసరా సందర్భంగా జీషన్ కార్యాలయం ముందు టపాసులు కాలుస్తుండగా బాబా సిద్దిఖీ హత్యకు గురయ్యారు. ఈ హత్య చేసింది తామేనని ఆ తర్వాతి రోజు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. సల్మాన్‌ఖాన్‌తో సన్నిహితంగా ఉండడం వల్లే సిద్దిఖీని హత్య చేసినట్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేశారు.
Salman Khan
Bollywood
Death Threat
Mumbai Police

More Telugu News