AP Govt: వైసీపీ హ‌యాంలోని ర‌హ‌స్య జీఓల‌పై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

YSRCP Secret GOs Uploading to GVOIR Website
  • ర‌హ‌స్యంగా ఉంచిన జీఓల‌న్నింటినీ జీఓఐఆర్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయించాల‌ని నిర్ణ‌యం
  • 2021 ఆగ‌స్టు 15 నుంచి 2024 ఆగ‌స్టు 28 వ‌ర‌కూ ర‌హ‌స్యంగా ఉంచిన జీఓల అప్‌లోడ్
  • ఈ మేర‌కు సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ కార్య‌ద‌ర్శి సురేశ్ కుమార్ ఉత్త‌ర్వులు
వైసీపీ హ‌యాంలోని ర‌హ‌స్య జీఓల‌పై తాజాగా ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ర‌హ‌స్యంగా ఉంచిన జీఓల‌న్నింటినీ జీఓఐఆర్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయించాల‌ని నిర్ణ‌యించింది. 2021 ఆగ‌స్టు 15 నుంచి 2024 ఆగ‌స్టు 28 వ‌ర‌కూ ర‌హ‌స్యంగా ఉంచిన జీఓల‌ను ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. 

ఈ మేర‌కు సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ కార్య‌ద‌ర్శి ఎస్‌. సురేశ్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. గోప్యంగా ఉంచిన జీఓల‌న్నింటినీ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం జీఓఐర్ వెబ్‌సైట్‌ను పున‌రుద్ధ‌రించ‌డంతో పాటు పాత జీఓలు అన్నిటినీ అందులో అప్‌లోడ్ చేయాల్సిందిగా ఐటీ ఎల‌క్ట్రానిక్స్ శాఖ అధికారుల‌ను ఆదేశించారు. 

వెబ్‌సైట్ ప్రారంభ‌మైన 2008 నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ అన్ని జీఓలు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ, కేవ‌లం వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో 2021 ఆగ‌స్టు 15 నుంచి 2024 ఆగ‌స్టు 28 వ‌ర‌కు ఉన్న జీఓలు మాత్ర‌మే అందుబాటులో లేవ‌ని సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ వెల్ల‌డించింది. 

మూడేళ్ల కాలానికి సంబంధించిన ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేక‌పోతే స‌మాచార లోపం ఏర్ప‌డుతుంద‌ని సురేశ్ కుమార్ తెలిపారు. అధికారిక నిర్ణ‌యాలు జీఓల రూపంలో ప్ర‌జల‌కు స్ప‌ష్ట‌తనిస్తాయ‌ని పేర్కొన్నారు. 
AP Govt
YSRCP Secret GOs
GVOIR Website
Andhra Pradesh

More Telugu News