Israel: కీలక పరిణామం.. ఇరాన్‌లో సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు

Israel hit back at Iran military targets in response to attacks on Israel
  • నిర్దిష్ట సైనిక లక్ష్యాలపై దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్
  • ఇటీవల ఇరాన్ దాడులకు ప్రతీకారమంటూ ప్రకటన
  • శనివారం తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్న దాడులు


తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న మధ్య ఆసియాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌లో నిర్దిష్ట సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. శనివారం తెల్లవారుజాము నుంచి ఈ మేరకు దాడులు కొనసాగిస్తోంది. ఇటీవల ఇరాన్ తమ దేశంపై దాడికి ప్రయత్నించిందని, దానికి ప్రతీకారంగా ఈ దాడులు మొదలుపెట్టామని ఇజ్రాయెల్ ప్రకటించింది.

‘‘ ఇరాన్‌ ప్రభుత్వం కొన్ని నెలల నుంచి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరంతరం చేస్తున్న దాడులకు ప్రతిస్పందనగా.. ప్రస్తుతం మా రక్షణ దళాలు ఆ దేశంలోని సైనిక లక్ష్యాలపై నిర్దిష్టమైన దాడులు నిర్వహిస్తున్నాయి’’ అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఇరాన్, దాని అనుకూల శక్తుల నుంచి ఎదురవుతున్న దాడులకు ప్రతిస్పందించే హక్కు, బాధ్యత తమకు ఉన్నాయని పేర్కొంది. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్‌‌తో దాడికి పాల్పడిందని పేర్కొంది. తమ రక్షణ, ఇతర సామర్థ్యాలు సంపూర్ణంగా సమీకరించుకున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ పేర్కొంది.

కాగా ఇజ్రాయెల్ దాడి పరిధి తెలియరాలేదు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ చుట్టుపక్కల బలమైన పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొంది. సమీపంలోని కరాజ్ నగరంలో కూడా పేలుళ్లు వినిపించాయని తెలిపింది.

కాగా అక్టోబరు 1న ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ 200లకు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిలో దాదాపు అన్నింటిని ఇజ్రాయెల్ బలగాలు గగన తలంలోనే కూల్చివేశాయి. ఆరు నెలల వ్యవధిలో ఇరాన్ చేసిన రెండవ ప్రత్యక్ష దాడి ఇది. అందుకే ప్రతీకార దాడి చేస్తున్నామని పేర్కొంది.
Israel
Iran
Israel Strikes

More Telugu News