Jagan-Sharmila: నీది గాని ఆస్తి కోసం ఎవరితో చేతులు కలిపావు తల్లీ నువ్వు?: షర్మిలపై రాచమల్లు ఫైర్

Rachamallu Sivaprasad Reddy slams YS Sharmila over Jagan family assets row
  • జగన్-షర్మిల ఆస్తి వివాదంపై రాచమల్లు స్పందన
  • షర్మిల... చంద్రబాబు, రేవంత్, సునీతలతో చేయి కలిపిందని ఆరోపణ
  • జగన్ ను మళ్లీ జైలుకు పంపాలనుకుంటున్నారా? అంటూ ఆగ్రహం 
జగన్-షర్మిల ఆస్తుల వివాదంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన షర్మిలపై విమర్శనాస్త్రాలు సంధించారు. నీది గాని ఆస్తి కోసం, అన్న ప్రేమతో ఇచ్చిన ఆస్తి కోసం ఎవరితో చేతులు కలిపావు తల్లీ నువ్వు? ఎవరిని జైలుకు పంపాలనుకుంటున్నావు తల్లీ నువ్వు? అంటూ ప్రశ్నించారు. 

"చంద్రబాబునాయుడితో చేతులు కలుపుతావా? రేవంత్ రెడ్డితో చేతులు కలుపుతావా? సునీతమ్మతో చేతులు కలుపుతావా? నువ్వు, సునీతమ్మ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి... మీ నలుగురూ కలిసి కుట్ర పన్ని జగన్ ను చిక్కుల్లోకి నెట్టాలనుకున్నారు. 

మరో 16 నెలలో, మరో రెండు సంవత్సరాలో ఆయనను జైలుకు పంపాలని ప్రయత్నం చేస్తావా? చంద్రబాబు ప్రయత్నం చేస్తే ఓ అర్థముంది, రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తే ఓ అర్థముంది... నువ్వు తోడబుట్టిన దానివి, రక్తం పంచుకు పుట్టిన దానివి... నీలోనూ రాజశేఖర్ రెడ్డి రక్తమే ఉంది... ఎందుకింత నీచానికి ఒడిగడుతున్నావు నువ్వు? 

స్పష్టంగా చెబుతున్నా... తల జగన్ మోహన్ రెడ్డిది, కత్తి షర్మిల, చెయ్యి చంద్రబాబుది... చంద్రబాబు చేతిలో ఉన్న కత్తి షర్మిల... నరికితే కిందపడాల్సిన తల జగన్ ది. ఎంత దారుణానికి తెగించావు తల్లీ నువ్వు?" అంటూ రాచమల్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Jagan-Sharmila
Assets
Rachamallu Sivaprasad Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News