Sanju Samson: సంజూ శాంసన్ పెదవిపై శ్లేష్మ తిత్తి

Sanju Samson will undergo treatment for a mucus cyst on his lower lip
  • దక్షిణాఫ్రికా టూర్‌కు ముందే చికిత్స చేయించుకోనున్న స్టార్ బ్యాటర్
  • రంజీ ట్రోఫీ 3వ రౌండ్‌కు దూరం కానున్న కేరళ క్రికెటర్
  • వెల్లడించిన కేరళ క్రికెట్ అసోసియేషన్ అధికారి
టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ కింది పెదవిపై శ్లేష్మ తిత్తి (లాలాజల ద్రావణాలతో ఏర్పడిన వాపు) ఏర్పడింది. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందే దీనికి చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో శనివారం (అక్టోబర్ 26) నుంచి మొదలుకానున్న రంజీ ట్రోఫీ మూడో రౌండ్‌కు అతడు  దూరమవనున్నాడు. కోల్‌కతాలో బెంగాల్‌తో జరగనున్న మ్యాచ్‌లో కేరళ జట్టుకు అందుబాటులో ఉండబోడని కేరళ క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు నిర్ధారించారు. 

నవంబర్ 8 నుంచి 13 మధ్య టీ20 సిరీస్ ఆడేందుకు భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఆ సమయం కంటే ముందే చికిత్స చేయించుకొని సిరీస్‌కు అందుబాటులో ఉండాలని సంజూ శాంసన్ భావిస్తున్నాడు. కాగా హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌పై జరిగిన టీ20లో కేవలం 40 బంతుల్లో సెంచరీ బాదడంతో టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు సంజూ కీలకమైన ఆటగాడిగా మారిపోయాడు.

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే రంజీ ట్రోఫీ రెండవ రౌండ్‌లో కేరళ జట్టుకు సంజూ శాంసన్ అందుబాటులోకి వచ్చాడు. ఆలూరులో కర్ణాటక వర్సెస్ కేరళ మ్యాచ్‌లో శాంసన్ ఆడాడు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ కొనసాగలేదు. కేవలం 50 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. ఆ సమయానికి కేరళ 3 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే సమయానికి శాంసన్ 13 బంతుల్లో 15 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నాడు. అప్పటికే 2 ఫోర్లు, ఒక సిక్సర్‌ బాదాడు.

ఇక శాంసన్ అందుబాటులో లేకుండానే బెంగాల్‌తో, ఉత్తరప్రదేశ్‌తో (నవంబర్ 6 -9 వరకు), హర్యానాతో (నవంబర్ 13-16 వరకు) కేరళ తలపడనుంది. కాగా ప్రస్తుతం రంజీ ట్రోఫీ గ్రూప్-సీలో కేరళ రెండు మ్యాచ్‌లు ఆడి ఒక విజయం సాధించింది. మరో మ్యాచ్‌ డ్రా కావడంతో గ్రూప్-సీలో రెండో స్థానంలో నిలిచింది.
Sanju Samson
Cricket
Team India
Kerala

More Telugu News