Chandrababu: ఈ లైన్ తో అన్ని రాజధానులకు అమరావతితో అనుసంధానం ఏర్పడుతుంది: సీఎం చంద్రబాబు

CM Chandrababu thanked PM Modi on Amaravati Railway Line getting nod from Centre
  • అమరావతి కనెక్టివిటీ ప్రాజెక్టుకు కేంద్రం ఓకే
  • 57 కిలోమీటర్ల మేర నూతన రైల్వే లైన్
  • రూ.2,245 కోట్ల వ్యయం కేటాయింపు
  • ఈ ప్రాజెక్టు నాలుగేళ్లలో పూర్తవుతుందన్న సీఎం చంద్రబాబు
  • కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని కేంద్రానికి విజ్ఞప్తి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీ రాజధాని అమరావతికి మళ్లీ మహర్దశ పట్టింది. తాజాగా, అమరావతి రైల్వేలైన్ కు కేంద్ర క్యాబినెట్ నేడు ఆమోదం తెలిపింది. ఈ కనెక్టివిటీ ప్రాజెక్టులో భాగంగా 57 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. దీనికోసం రూ.2,245 కోట్ల నిధులు కేటాయించనున్నారు. 

ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టు ఆమోదించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు. గుంటూరు, విజయవాడ నగరాలను కవర్ చేసేలా రాజధాని పక్కగా ఈ రైల్వే లైన్ వెళుతుందని వివరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులకు ఈ రైల్వే లైన్ ద్వారా అమరావతితో అనుసంధానం ఏర్పడుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. 

వేల కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన అమరావతి రైల్వే ప్రాజెక్టు నాలుగేళ్లలో పూర్తవుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రైల్వే లైను కృష్ణా నదిపై వెళుతుందని, ఇది ఎంతో రమణీయంగా ఉంటుందని చంద్రబాబు అభివర్ణించారు. ఈ సందర్భంగా కృష్ణా నదిపై కట్టే రైల్వే వంతెనను ఐకానిక్ బ్రిడ్జిగా నిర్మించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరుతున్నామని తెలిపారు. 

ఏపీ రాజధాని అమరావతి నగరం దేశంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటవుతుందని, ఈ నగరం నిర్మాణానికి కేంద్రం అనేక మార్గాల్లో సాయం చేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. 

చాలా తక్కువ సమయంలోనే అమరావతి అంశాన్ని ప్రధాని మోదీ క్యాబినెట్ ముందుకు తీసుకెళ్లారని, అంతేకాకుండా, క్యాబినెట్ ఆమోదం కూడా లభించిందని అన్నారు.
Chandrababu
Amaravati Railway Line
Narendra Modi
Union Cabinet
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News