YS Family Disputes: తల్లికి, చెల్లికి ఆస్తి ఇవ్వనంటూ కోర్టుకెక్కడం జగన్ క్రూరత్వానికి నిదర్శనం: సోమిరెడ్డి

Somireddy take a dig at Jagan over family assets issue
  • రచ్చకెక్కిన వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారం
  • గిఫ్ట్ డీడ్ వెనక్కి తీసుకుంటానంటూ జగన్ లేఖ!
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న షర్మిల
  • తండ్రినే ముద్దాయిని చేసిన వ్యక్తి జగన్ అంటూ సోమిరెడ్డి విమర్శలు
  • తల్లిని, చెల్లిని కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని వ్యాఖ్యలు
వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఆస్తి ఇవ్వబోనంటూ జగన్ లేఖ, అందుకు ప్రతిగా షర్మిల తీవ్రస్థాయిలో స్పందించడం తదితర అంశాలు మీడియాలో ప్రముఖంగా దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, టీడీపీ సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. 

తల్లికి, చెల్లికి ఆస్తి ఇచ్చేది లేదంటూ జగన్ కోర్టుకెళ్లడం అతడి క్రూరత్వానికి నిదర్శనం అని విమర్శించారు. ఆస్తి విషయంలో తల్లిని, చెల్లిని బ్లాక్ మెయిల్ చేయడం దారుణమని పేర్కొన్నారు. 

"నిన్న ఆయన ఎన్సీఎల్టీకి ఒక ఫిర్యాదు చేశాడు. తల్లి, చెల్లికి ఇచ్చిన ఆస్తి పంపకంలో గిఫ్ట్ డీడ్స్ రద్దు చేయాలని కోరాడు. జగన్ మోహన్ రెడ్డి ఎంతటి క్రూరుడు అంటే... ఓట్లు కోసం నా తల్లి, నా చెల్లి, నా తండ్రి, నా అక్క అని మాట్లాడతాడు. కానీ సొంత కుటుంబం విషయంలో... తల్లికి, చెల్లికి ఆస్తి విషయంలో ఓ నిర్ణయం తీసుకుని, మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటానంటున్నాడు. రాజకీయంగా తనకు దాసోహం కావాలని వారిని బెదిరిస్తున్నాడు. రాజకీయాలకు, ఆస్తులకు ఏమిటి సంబంధం? 

కోట్ల విలువ చేసే ప్రజా ఆస్తులు దోచుకుని కూడా తల్లికి, చెల్లికి ఇవ్వడానికి నీకు మనసొప్పడం లేదు. ఇది ఎవరి ఆస్తి?... ఇది ప్రజల ఆస్తి! ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీంకోర్టుకు వరకు వెళ్లి... ఇందులో నాకేం సంబంధం లేదు, అంతా మా నాన్నకి సంబంధించిన విషయం అని చెప్పిన వ్యక్తి... జగన్! 

మీ తండ్రి రాజశేఖర్ రెడ్డిని కేసులో పెట్టించిన గొప్పవాడివి నువ్వు. చనిపోయిన తండ్రిని ముద్దాయిని చేశావు... అది నీ క్రూర మనస్తత్వానికి ఒక నిదర్శనం! దేశంలో ప్రజల ఆస్తులు సొంతానికి కూడగట్టుకున్న వారిలో నీది రెండోస్థానం. తమరు కాంగ్రెస్ తో లాలూచీ పడుతున్నారు... బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుని కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతున్నారనేది బయటికి వచ్చింది. 

నీ పాపాలన్నీ కోర్టుల ముందున్నాయి... ఈ లోపు కేంద్రం ఎక్కడ కన్నెర్ర చేస్తుందోనని ఇప్పుడు కొత్త నాటకం మొదలుపెట్టావు. కాంగ్రెస్ తో విభేదాలు ఉన్నాయి అని చెప్పుకోవడం కోసం ఈ లేఖ నీ నాటకంలో ఓ భాగం అయ్యుండొచ్చని తెలుస్తోంది" అంటూ సోమిరెడ్డి పేర్కొన్నారు.
YS Family Disputes
Somireddy Chandra Mohan Reddy
Jagan
Sharmila
TDP
YSRCP

More Telugu News