Priyanka Gandhi: ప్రియాంక గాంధీ, భర్త రాబర్ట్ వాద్రా ఆస్తి విలువ ఎంతో తెలుసా?.. అఫిడవిట్‌లో కీలక విషయాలు!

Priyanka Gandhi and her bhusband Robert Vadra combined net worth is around Rs 78 crores
  • తన పేరిట రూ.12 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయన్న ప్రియాంక  
  • భర్త రాబర్డ్ వాద్రాతో కలిపి ఉమ్మడిగా రూ.78 కోట్ల ఆస్తి ఉందని వెల్లడి
  • భర్త బహుమతిగా ఇచ్చిన కారు, బంగారు నగలు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రియాంక గాంధీ
వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అఫిడవిట్‌లో తన ఆస్తి, విద్య, ఇతర వివరాలను వెల్లడించారు. తనకు, తన భర్త రాబర్డ్ వాద్రాకు ఉమ్మడిగా సుమారు రూ.78 కోట్ల విలువైన నికర ఆస్తులు ఉన్నాయని చెప్పారు. వ్యక్తిగతంగా తన పేరిట రూ.12 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని ఆమె ప్రకటించారు. సిమ్లాలో రూ.5.63 కోట్ల విలువైన ఒక ఇల్లు తన పేరిట ఉందని చెప్పారు. సిమ్లాలోని ఈ నివాస ఆస్తిని తానే స్వయంగా సంపాదించుకున్నట్టు ఆమె వెల్లడించారు.

పూర్తి వివరాలు ఇవే..
2023-2024లో తన ఆదాయం రూ.46.39 లక్షలుగా ఉందని ప్రియాంక గాంధీ చెప్పారు. అద్దెలతో పాటు బ్యాంకులు, ఇతర పెట్టుబడులపై వడ్డీ రూపంలో ఈ ఆదాయాన్ని పొందానని ఆమె వివరించారు. మూడు బ్యాంకు ఖాతాలలో వివిధ మొత్తాలలో డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఉన్నాయన్నారు. తన భర్త వాద్రా బహుమతిగా ఇచ్చిన హోండా సీఆర్‌వీ కారుతో పాటు రూ.1.15 కోట్ల విలువైన 4,400 గ్రాముల బంగారు నగలు ఉన్నాయని తెలిపారు. తన వద్ద రూ. 4.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని తెలిపారు. ఇక తన భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల నికర విలువ సుమారుగా రూ.65.54 కోట్లు అని ప్రియాంక గాంధీ తెలిపారు. వాద్రా వద్ద రూ.37.9 కోట్లకు పైగా చరాస్తులు, రూ. 27.64 కోట్లకు పైగా స్థిరాస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

విద్యార్హతల విషయానికి వస్తే యూకేలోని సుందర్‌ల్యాండ్ విశ్వవిద్యాలయం నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌ ద్వారా బౌద్ధ అధ్యయనాలలో పీజీ డిప్లొమా, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో బీఏ (ఆనర్స్) డిగ్రీ పొందానని చెప్పారు.

ఇక మధ్యప్రదేశ్‌లో 2023లో తనపై ఒక ఎఫ్‌ఐఆర్‌ నమోదయిందని ప్రియాంక గాంధీ వెల్లడించారు. తప్పుదోవ పట్టించేలా ట్వీట్స్ చేశానంటూ ఐపీసీలోని సెక్షన్ 420 (చీటింగ్), 469 (ఫోర్జరీ) కింద ఈ కేసు ఉంది. ఒక ప్రైవేట్ వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదయిందని చెప్పారు. 2020లో ఉత్తరప్రదేశ్‌లో కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదయిందని వివరించారు.
Priyanka Gandhi
Robert Vadra
Wayanad
Congress

More Telugu News