Cyclone Dana: నేటి రాత్రి తీరం దాటనున్న ‘దానా’.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

Cyclone Dana To Cross Tomorrow Between Odisha And West Bengal
  • ఏపీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను భయపెడుతున్న తుపాను
  • బిత్తర్‌కనిక-ధమ్రా మధ్య తీరం దాటే అవకాశం
  • పశ్చిమ బెంగాల్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కరిసే అవకాశం
  •  ఏపీలోని పోర్టుల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
  • గత రాత్రి నుంచి ఇప్పటి వరకు 200కుపైగా రైళ్ల రద్దు
ఏపీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను భయపెడుతున్న ‘దానా’ తుపాను నేడు తీవ్ర తుపానుగా మారనుంది. అనంతరం ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత కానీ, రేపు తెల్లవారుజామున కానీ ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి మధ్యలో బిత్తర్‌కనిక, ధమ్రా (ఒడిశా)కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది.

తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దాదాపు 36 గంటలు తీవ్ర తుపానుగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం, మిగిలిన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఏపీలో మూడు రోజులు వానలు
తుపాను ప్రభావంతో ఏపీలో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

పోర్టులకు రెండో నంబర్ హెచ్చరిక
భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్టణం, కాకినాడ, గంగవరం, విశాఖపట్టణం, కళింగపట్టణం పోర్టుకు రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. సముద్రం అలజడిగా ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంబడి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. దానా తుపాను నేపథ్యంలో గత రాత్రి 8 గంటల నుంచి నేటి ఉదయం 10 గంటల మధ్య ఈస్ట్రన్ సీల్దా డివిజన్‌లో 190 రైళ్లను రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వేలోనూ 14 రైళ్లు రద్దయ్యాయి.  
Cyclone Dana
Andhra Pradesh
Tamil Nadu
Odisha
West Bengal

More Telugu News